శాంతిదూత కొఫీ అన్నన్ కన్నుమూత

ప్రపంచ శాంతిదూత కొఫీ అన్నన్ (80) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా ఆయన అనారోగ్యం బాధపడుతున్నారు. చికిత్స పొందుతూ స్విట్జర్లాండ్‌లో ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని కోఫి కుటుంబ సభ్యులు తెలిపారు. ఆఫ్రికా ఖండం నుంచి ఐరాసకు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మొట్టమొదటి నల్లజాతీయుడు. జనవరి 1, 1997 నుంచి డిసెంబరు 31, 2006 వరకూ పదేళ్ళపాటు ఆయన ఆ పదవిలో కొనసాగారు.

ఘనాలోని కుమాసిలో జన్మించిన అన్నన్‌ అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించారు. 1961లో డిగ్రీ, 1972లో మేనేజ్‌మెంట్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. 1962లో బడ్జెట్ అధికారిగా అన్నన్ ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించారు. 1987-92 కాలంలో సహాయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1997లో తొలిసారి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా బౌత్రోస్ బౌత్రోస్‌ ఘలీ నుంచి బాధ్యతలు స్వీకరించారు. 2001లో అన్నన్ కు నోబెల్ శాంతి బహుమతి వరించింది. కోఫి అన్నన్ మృతిపట్ల ప్రపంచ దేశాలు సంతాపం ప్రకటించారు.