ట్రాఫిక్ ఉల్లంఘ‌న‌లో రికార్డు…!!

రికార్డులు సృష్టించాల‌న్నా, వాటిని తిర‌గ‌రాయ‌ల‌న్నా ఇత‌నికే చెల్లిందా అన్న‌ట్లుగా ఉంది ఓ వ్య‌క్తి వ్య‌వ‌హారం. కిక్కు కోస‌మో,రికార్డుకెక్క‌డం కోస‌మో అత‌ను ఇలా చేయ‌క‌పోయినా ట్రాఫిక్ ఉల్లంఘ‌న‌లో మాత్రం ఆ వ్య‌క్తిది ఓ రికార్డ‌యింది. ఒకే వాహ‌నానికి 45 చ‌లాన్లు ప‌డ‌టంతో యాభైనాలుగు వేలు దాటింది జ‌రిమానా. చ‌లాన్ల‌ను నిర్ల‌క్ష్యం చేస్తూ త‌న‌ప‌ని తాను చేసుకుపోతుండ‌టంతో జ‌రిమానా కాస్త త‌డిసిమోపెడైంది. అనుకోకుండా చిక్కడంతో అతని దగ్గర్నుంచి మొత్తం జరిమానాను వసూలు చేశారు ట్రాఫిక్‌ పోలీసులు.

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన బాలాజీ ఏడాదిన్నరగా ఇన్నోవా క్రిస్టా వాహనాన్ని (ఏపీ05డిఎస్‌8888) ఉపయోగిస్తున్నాడు. అనేకసార్లు ట్రాఫిక్‌ పోలీసులు ఈ కారుపై ఓవర్‌స్పీడ్‌ కేసులు నమోదు చేశారు. వ్యక్తిగత పనులపై నగరానికి వచ్చిన బాలాజీ తన వాహనాన్ని శనివారం హిమాయత్‌నగర్‌లో పార్కు చేశాడు. ట్రాఫిక్‌ ఎస్సై కృష్ణంరాజు నోపార్కింగ్‌లో ఉన్న బాలాజీ వాహనం జరిమానాల పాత చిట్టాను పరిశీలించారు. మొత్తం 45 చలాన్లకు రూ.54,773 చెల్లించాల్సి ఉన్నట్లు గుర్తించి.. చెల్లించకపోతే వాహనాన్ని సీజ్‌ చేసి చార్జ్‌షీట్‌ వేస్తామని హెచ్చరించడంతో బాలాజీ జరిమానాను డెబిట్‌ కార్డు ద్వారా చెల్లించార‌ట‌.