ఆ విషయంలో కేసీర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారం కైవసం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలతో ముందకు వెళుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గెలుపే లక్ష్యంగా జాతీయ స్థాయిలో నేతలు పర్యటనలు షురూ చేశారు. అధికార టీఆర్ఎస్ పై విమర్శల వర్షం కురిపిస్తూ యాత్రలు మొదలుపెడుతున్నాయి. ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టినా, ఎంత అభివృద్ధిని చేసినా ఎన్నికల్లో అభివృద్ధి మంత్రం ఒక్కటే పనిచేయదు. ఈవిషయం ముఖ్యమంత్రి కేసీఆర్ కు బాగా తెలుసు. అందుకే ఓటింగ్ పాలిటిక్స్ లోనూ తన మార్కు వ్యూహానికి పదును పెట్టారు. అందరూ ఊహిస్తున్నట్లుగా వచ్చే ఎన్నికల తరువాత తనయుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడంతో పాటు కేంద్రంలో తాను క్రియాశీలకంగా వ్యవహరించేందుకు ప్లాన్ వేశారు కేసీఆర్.
కేసీఆర్ తన వ్యూహాన్నిఅమలు చేయడంలో భాగంగా తొలి అడుగుగా ఫెడరల్ ఫ్రంట్ అస్త్రాన్ని ప్రయోగించారు. దేశ్ కీ నేత అంటూ టీఆర్ఎస్ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో కేసీఆర్ కు నీరాజనాలు పలికినా ఆశించిన స్థాయిలో దేశంలోని రాజకీయ పార్టీల నుంచి స్పందన రాకపోవడంతో ఇక ఫ్రంట్ వ్యహారాన్ని కోల్డ్ స్టోరేజీలో ఉంచారు. పార్టీలో అంతర్గతంగా విభేదాలు తలెత్తకుండా తానే ముఖ్యమంత్రినని మళ్లీ చెప్పుకున్నా తన ప్రయత్నం మాత్రం కొనసాగిస్తునే ఉన్నారు కేసీఆర్. రెండో అడుగుగా ముందస్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రాష్ట్రంలో ఎలక్షన్ హీట్ తీసుకువచ్చారు.కేంద్రంతో సఖ్యతగా మెలుగుతూ ముందస్తు ఎన్నికల వ్యూహానికి కేంద్రం సహకరించాలని కోరారు సీఎం.
కేవలం అసెంబ్లీ ఎన్నికలు ముందు నిర్వహించి ఆ తరువాత పార్లమెంటు ఎన్నికలు నిర్వహిస్తే జాతీయ స్థాయి రాజకీయాల ప్రభావం అంతగా రాష్ట్రంలో ఎన్నికలపై పడదని, తద్వారా టీఆర్ఎస్ ను మళ్లీ అధికారంలోకి తీసుకు రావచ్చని కేసీఆర్ భావిస్తున్నారట. ఇందుకోసం మోదీకి తన విన్నపం వినిపించారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ కేసీఆర్ భావించినట్లే ఎన్నికలు జరిగితేగనక కేసీఆర్ వ్యూహం ఫలించినట్లే. మరి కేసీఆర్ ప్లాన్ ఏమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి మరి.