విజయ్ ని ‘స్టార్’ని చేసిన మెగాస్టార్

విజయ్ దేవరకొండ.. టాలీవుడ్ సంచలనం. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో ట్రెండ్ సెట్ చేశాడు. స్టార్ హీరో అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయనిపించుకొన్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తర్వాత ఆ రేంజ్ లో యూత్ లో ఫాలోయింగ్ సంపాదించుకొన్నాడు. జూ. పవర్ స్టార్, తెలంగాణ పవర్ స్టార్ అంటూ ప్రశంసలు అందుకొన్నాడు.

ఇక, విజయ్ స్టార్ హీరో అనిపించుకోవడానికి ఒక్కటే కావాలి. అదే ఫ్యామిలీ హీరో అనిపించుకోవాలి. ‘గీత గోవిందం’తో అదీ జరిగిపోయింది. పరశురామ్ దర్శకత్వంలో విజయ్-రష్మిక జంటగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘గీత గోవిందం’
ని సూపర్ హిట్ గా తేల్చేశారు ప్రేక్షకులు. ఇప్పటికే ఈ సినిమా రూ. 50కోట్ల క్లబ్ లో చేరిపోయింది. రూ. 15కోట్లకు అమ్ముడుపోయిన ఈ సినిమాని భారీ లాభాలని తీసుకొస్తోంది. ఈ ఫలితంతో ఆనందంలో ఉన్న చిత్రబృందం ఆదివారం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ని నిర్వహించింది.

ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన మెగాస్టార్.. ” గీత గోవిందంతో విజయ్‌ దేవరకొండ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు తెలుగు పరిశ్రమలో మనకున్న స్టార్లలో తనూ ఒకడయ్యాడు” అన్నారు. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి అంతటివారే విజయ్ దేవరకొండ స్టార్ హీరో అని కితాబిచ్చారు. ఇక ఇండస్ట్రీ, ప్రేక్షకులు.. అందరు విజయ్ స్టార్ హీరో అని ఒప్పుకొని తీరాల్సిందే.