హిట్లర్’కు పట్టిన గతే జగన్’ కూ …!
హిట్లర్ తన దుష్ప్రచారం కోసం గోబెల్స్ ను పెట్టుకున్నట్లే జగన్మోహన్ రెడ్డి తన దుష్ప్రచారం కోసం సాక్షిని పెట్టాడని ఏపీ ఆర్థిక మంత్రి యనమల ఆరోపించారు. అబద్దాలలో,దుష్ప్రచారంలో సాక్షి గోబెల్స్ ను మించిపోయిందని అన్నారు.హిట్లర్ ఆత్మహత్య చేసుకున్న మరునాడే గోబెల్స్ కూడా కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నాడని, హిట్లర్ కు,గోబెల్స్ కు పట్టిన గతే జగన్ కు,ఆయన మీడియాకు పడుతుందని హెచ్చరించారాయన. 2019ఎన్నికల తరువాత జగన్, ఆయన మీడియా రెండూ కనిపించవని, వాళ్ల అబద్దాలు, తప్పుడు ప్రచారాలు నిలవవన్నారు. అబద్దాలతో ప్రజల్లో అపోహలు సృష్టించాలనే జగన్ కుట్ర ఫలించదన్నారు.
బిజెపి పంచన చేరి జగన్ టిడిపిపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు యనమల. జాతీయ రాజకీయాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో యథాలాపంగా చర్చించారని, దానికి చిలవలు పలవలుగా ప్రచారం చేయడం అతి హేయమన్నారు. గోబెల్స్ కూడా సిగ్గుపడేలా జగన్,అతని మీడియా దుష్ప్రచారానికి తెగబడిందని విమర్శించారు. కాంగ్రెసేతర,బిజెపియేతర పార్టీలను ఏకం చేయగల శక్తి తెలుగుదేశం పార్టీకే ఉంది. అదే అంశం ఇప్పటికే చరిత్రలో రుజువైందన్నారు. నేషనల్ ఫ్రంట్,యునైటెడ్ ఫ్రంట్ ల ఏర్పాటు వెనుక కీలక భూమిక టిడిపిదే. ఆ దిశగానే ప్రస్తుతం కూడా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. రాబోయే ప్రధానిని నిర్ణయించేది తెలుగుదేశం పార్టీనే అని చెప్పుకొచ్చారు.
రాష్ట్రం కోసమే బిజెపితో పొత్తు పెట్టుకున్నామని, రాష్ట్రం కోసమే ఎన్డీఏ నుంచి బైటకొచ్చి పోరాడుతున్నామని యనమల తెలిపారు. చంద్రబాబుకు 6పెళ్లిళ్లని ,పవన్ కళ్యాణ్ కు 4గురు పెళ్లాలు అంటూ జగన్ చిత్త చాంచల్యంతోనే ఇటువంటి విమర్శలు చేస్తున్నారన్నారాయన. పెళ్లిళ్ల గురించి,పెళ్లాల గురించి జగన్ కే తెలియాలి,తమకు తెలియదని ఎద్దేవా చేశారు.