మంత్రుల‌తో సీఎం కేసీఆర్ ఆకస్మిక‌ భేటీ..! ఏమైఉంటుంద‌బ్బా.. ?

ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో బుధ‌వారం సాయంత్రం 4గంట‌ల‌కు మంత్రుల‌తో సీఎం కేసీఆర్ అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేశారు. అందుబాటులో ఉండాలంటూ మంగ‌ళ‌వారం సాయంత్ర‌మే మంత్రుల‌కు సమాచారం చేర‌వేశారు. దీంతో అన‌ధికారికంగా ఈ ఆక‌స్మిక కేబినెట్ భేటీ ఎందుక‌నే చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ‘ముందస్తు’ సంకేతాలకు, ఈ భేటీకి ఏదైనా సంబంధం ఉంటుందేమో అనే ఆస‌క్తి అంద‌రిలో నెల‌కొంది. గ‌తంలో సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తే మా మంత్రులకే తెలియదు. మీకు చెప్తానా అంటూ వ్యాఖ్యానించడం ,ఇప్పుడు ఈ ఆక‌స్మిక భేటీ ఏర్పాటు చేయ‌డాన్ని ముద‌స్తుపై సీఎం ఏదైనా నిర్ణ‌యం తీసుకుంటారా అనే ప్ర‌శ్న అంద‌రినీ వేధిస్తోంది. \

సాధారణంగా పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి మంత్రివర్గం స‌మావేశ‌మ‌వ‌తుంది. ఇందుకు మంత్రులకు అధికారికంగా అజెండా, సమాచారం ఇస్తారు. కానీ, బుధవారం సాయంత్రం జరిగేది మాత్రం అనధికారిక మంత్రివర్గ సమావేశంగా తెలుస్తోంది. బుధవారం హైదరాబాద్‌లో అందుబాటులో ఉండాలంటూ మంత్రులందరికీ ముఖ్యమంత్రి అధికారిక నివాసం నుంచి మంగళవారం సమాచారం అందిన‌ట్లుగా తెలుస్తోంది. పిలిచిన వెంటనే వచ్చేలా బుధవారం సాయంత్రం 4 గంటల్లోపే హైదరాబాద్‌లో ఉండాలనే సూచన వచ్చింది. దీంతో మంత్రులు త‌మ ప‌ర్య‌ట‌న‌లు ర‌ద్దు చేసుకుని హైద‌రాబాద్ కు తిరుగు ప్ర‌యాణ‌మ‌య్యారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో జ‌రిగే ఈ ఆక‌స్మిక భేటీ వెన‌క మ‌త‌ల‌బు ఏమిటో సాయంత్రం తేలిపోనుంది.