‘సైరా’కు పన్ను రాయితీ పంచాయతీ షురు !

గొప్ప స్వాతంత్ర పోరాట యోధుడు ‘ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి’ జీవిత కథతో మెగాస్టార్ చిరంజీవి 151 చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. చిరు పుట్టిన రోజు కానుకగా సైరా టీజర్ ని నిన్ననే విడుదల చేశారు. ఈ టీజర్ లో చిరంజీవి వివ్వరూపాన్ని చూపించారు. ఉగ్రరూపుడైన నరసింహారెడ్డి పాత్రలో చిరంజీవి లుక్ అదిరిపోయింది. కేవలం 33 సెకన్ల టీజర్ చూస్తేనే రోమాలు నిక్కబోడుచుకుంటున్నాయి.

ఉయ్యాలవాడ మన తెలుగోడు. కర్నూలు ప్రాంతంలో ఉండి ఆంగ్లేయులను గడగడలాడించిన సమర వీరుడు. 1857 నాటి ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామానికి ముందే తెల్లదొర తనంపై యుద్ధం చేసిన ధీరుడు. ఆయన జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహం అందించాలి అనే డిమాండ్ వినపడుతుంది.

గతంలో రుద్రమదేవి సినిమాకు తెలంగాణా ప్రభుత్వం పన్ను రాయితీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఎలాంటి పన్ను రాయితీ ప్రకటించలేదు. దీనిపై ‘రుద్రమదేవి’ సినిమా దర్శక నిర్మాత గుణశేఖర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకట్రెండు సార్లు ఏపీ ప్రభుత్వ తీరుని బాహాటంగానే ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ‘సైరా’కు ఏపీ ప్రభుత్వం పన్ను రాయితీ ఇస్తుందా.. ? లేదా..?? అన్నది ఆసక్తిగా మారింది.