‘ముందస్తు’ గుట్టు విప్పిన రేవంత్..!
ప్రజా సమస్యలు నుంచి ప్రజల దృష్టి మర్లించేదుకే ముందస్తు ఎన్నికల డ్రామా కేసీఆర్ చేస్తున్నారని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఓటర్ లిస్ట్ వచ్చే జనవరి కల్లా పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల అధికారి రాష్ట్ర ఎన్నికల అధికారి లేఖ రాశారని, ఓటర్ లిస్ట్ పూర్తి కాకుండా ఎలా ముందస్తు ఎన్నికలను నిర్వహిస్తారని రేవంత్ ప్రశ్నించారు. కాంగ్రెస్ శ్రేణులు ముందస్తు ప్రిపరేషన్స్ పక్కన పెట్టి సర్కార్ వైఫల్యాలను జనం లోకి తీసుకెళ్లాలని ఆయన అన్నారు. అసెంబ్లీ లో ఎంఐఎం తో కలిసి వెళ్లి ఆ తరువాత ఎంఐఎంను పక్కన పెట్టి బీజేపీ తో కలిసి లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నాడని రేవంత్ చెప్పారు. ఎంఐఎం కూడా దీనిపై ఆలోచించాలని అన్నారు.
జమిలీ ఎన్నికలంటున్న మోడీ, అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలకు ఎలా సహరిస్తారని, రాజకీయ లబ్ధి పొందేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు మోడీ సహకరిస్తే అది లోపాయకారి ఒప్పందమేనని అన్నారు రేవంత్. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు వేరువేరుగా పెట్టడం వల్ల ఆర్థికా భారమేనని ఆయన చెప్పారు. పార్టీ క్యాడర్ ను అప్రమత్తం చేసేందుకు మాత్రమే పీసీసీ చీఫ్ ముందస్తు ఎన్నికలంటున్నారని, ఏ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకే పీసీసి అధ్యక్షుగా ఉత్తమ్ పార్టీ ని సమాయత్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. బీజేపీ తో కలిసేవాళ్లను, లోపాయకారి ఒప్పందాలు పెట్టుకునే వాళ్ళు తమకు శత్రువులేనని చంద్రబాబు ఆ పార్టీ నేతలకు చెప్పారని రేవంత్ గుర్తు చేశారు.
చంద్రబాబు మాటల ప్రకారం తెలంగాణలో టిఆర్ఎస్ వారికి శత్రువుని తేలిపోయిందని, ఇక మిత్రులెవరన్నది తెలడానికి ఇంకా సమయం పడుతుందని ఆయన అన్నారు. టీడీపి తో ఎన్నికల పొత్తు అధిష్టానం నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత లేదంటూ టీఆర్ఎస్ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని, రాహుల్ తనకు సభలో ఇచ్చిన ప్రాముఖ్యత చూస్తే వారికి అర్ధం అవుతుందని చెప్పారు రేవంత్.