అప్ప‌ట్లో కాంగ్రెస్… ఇప్పుడు టీఆర్ఎస్..!

అధికార టీఆర్ఎస్ వ్య‌వ‌హార‌శైలిపై కాంగ్రెస్ నేత‌లు విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు కోసం టీఆర్ఎస్ అవ‌లంభిస్తున్న వైఖ‌రిని ఎద్దేవా చేశారు. దేశ వ్యాప్తంగా కూట‌ములు క‌డుతుండ‌టంతో రాష్ట్రంలో కూడా పొత్తులు సాధ్య‌మేన‌ని కాంగ్రెస్ నేత భ‌ట్టి విక్ర‌మార్క అభిప్రాయ‌ప‌డ్డారు. తెలంగాణ‌లో టీడీపీతో క‌లిసి న‌డ‌వ‌డానికి ఇబ్బందేమీ లేద‌ని, టీడీపీ ఆవిర్భ‌వించ‌నప్ప‌టి ప‌రిస్థితులు వేరు, ఇప్ప‌టి ప‌రిస్థితులు వేర‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

పొత్తుల కోసం ఇప్ప‌టికే చాలా పార్టీలు కాంగ్రెస్ తో ట‌చ్ లో ఉన్నాయ‌ని ఆయ‌న తెలిపారు. భారీ స‌భ‌ల‌తో గెలుస్తామ‌నుకోవ‌డం టీఆర్ఎస్ పార్టీ అవివేక‌మ‌ని ఆయ‌న విమ‌ర్శించారు. గ‌తంలో ఉమ్మ‌డి రాష్ట్రంలో 1994లో కాంగ్రెస్ పార్టీ నెల్లూరులో స‌భ‌పెడితే వైరా వ‌ర‌కు రోడ్డుల జాం అయ్యాయ‌ని ఆయ‌న గుర్తు చేశారు. ఆనాడు స‌భ‌కు హాజ‌రైన భారీ జ‌నాల‌ను చూసి కోట్ల విజ‌య‌భాస్క‌ర్ రెడ్డి ఆశ్చ‌ర్య‌పోయార‌ని, కానీ అప్ప‌టి ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ కేవ‌లం 26 స్థానాల్లో మాత్ర‌మే గెలిచింద‌ని గుర్తు చేశారు. ప్ర‌స్తుతం టీఆర్ఎస్ ప‌రిస్థితి అంతేన‌ని ఎద్దేవా చేశారు.