సీఎం ఢిల్లీ టూర్ సక్సెస్…
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం సాయంత్రం న్యూడిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమాడిని కలిశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగులో వున్న అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా కొత్త జోనల్ వ్యవస్థకు వెంటనే ఆమోదం తెలపాల్సిందిగా అభ్యర్తించారు. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలిపే విషయంలో జాప్యం జరుగుతుండడం, కొత్త నియామకాలు చేపట్టడంపై ప్రభావం చూపుతోందని ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఇవ్వాల్సిన రూ. 450 కోట్లను వెంటనే విడుదల చేయాలని, అదనపు ఎఫ్.ఆర్.బి.ఎమ్ నిధులను విడుదల చేయాలని, మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన వడ్డీ సబ్సిడీలో, రైతులకు ఇవ్వాల్సిన వడ్డీ సబ్సిడీలొ కేంద్రం వాటాను విడుదల చేయాలని కోరారు.
హైకోర్టును సత్వరంగా విభజించాలని, రీజినల్ రింగ్ రోడ్డుకు నిధులు కేటాయించాలని, జాతీయ రహదారుల విస్తరణ, కొత్త సెక్రేటేరియట్ నిర్మాణం కోసం రక్షణ శాఖ భూములు కేటాయించాలని ముఖ్యమంత్రి కోరారు. తాను ప్రస్తావించిన అన్ని అంశాలకు సంబంధించి పరిష్కారం, ఆమోదం లభించేలా చొరవ చూపాలని ఆయా మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేయాలని ముఖ్యమంత్రి ప్రధానిని కోరారు. తెలంగాణ రాష్ట్రానికి 14వ ఆర్థిక సంఘం సూచించన మేరకు జీ.ఎస్.డి.పి లో మరో అర శాతం అదనంగా ఎఫ్.ఆర్.బి.ఎమ్. నిధులు సమకూర్చాలని ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కోరారు. జీ.ఎస్.డి.పిలో మూడు శాతానికి లోబడి తెలంగాణ రాష్ట్రం అప్పులు సమకూర్చుకున్నదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ రాష్ట్రం కాబట్టీ 3.5 శాతం వరకు నిధులను అప్పుల రూపంలో తీసుకునే వెసులుబాటును 14వ ఆర్థిక సంఘం కల్పించిన విషయాన్ని ముఖ్యమంత్రి చెప్పారు.