నాన్నకు ప్రేమతో.. చరణ్ !
నాన్నకు ప్రేమతో.. రామ్ చరణ్ చాలానే చేస్తున్నాడు. తండ్రి సినిమాల కోసం తన సినిమాలను కూడా తక్కువ చేసుకొంటున్నాడు. ‘ఖైదీ నెం. 150’ సినిమా సమయంలో ‘ధృవ’ సినిమాని సైడ్ చేశాడు. కనీసం మంచి సీజన్ కూడా చూడకుండా విడుదల చేశాడు. అయినా.. ‘ధృవ’ సూపర్ హిట్ అయిందనుకోండీ.. ! ఇప్పుడు ‘సైరా’ కోసం బెల్లకొండ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న తన సినిమాని పెద్దగా పట్టించుకోవడం లేదని ఆయన అభిమానులు ఫీలైపోతున్నారు.
మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా ఆగస్టు 22న రామ్ చరణ్ సినిమాకు సంబంధించి ఫస్టు లుక్కు, టైటిల్ పోస్టర్ వస్తాయని అభిమానులు ఆశించారు. ఐతే, ఆ రోజు మెగాస్టార్ డే మాత్రమే కావాలని తన సినిమాని పక్కన పెట్టేశాడు. ఆ తర్వాత వినాయక చవితికి అయినా చరణ్ సినిమా ఫస్ట్ లుక్ వస్తుందేమో అనుకొంటే.. చప్పుడూ లేదు. ఇప్పుడు చరణ్ ధ్యాసంతా ‘సైరా’ సినిమాపైనే. బడ్జెట్ గురించి ఏ మాత్రం ఆలోచించకుండా ‘సైరా’తో నాన్నకు ఓ అద్భుతమైన సినిమా అందించాలనే ప్రయత్నంలో చరణ్ ఉన్నాడు.
అది మంచిదే. మెగా అభిమానులు మరింత ఆనందంగా ఫీలయ్యే విషయం అది. ఐతే, వచ్చే యేడాది వేసవి రావాల్సిన ‘సైరా’ కోసం.. నాలుగు నెలల్లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన తన సినిమాని చరణ్ సరిగ్గా పట్టించుకోవడం లేదని ఆయన అభిమానులు ఫీలవుతున్నారు. చరణ్ సినిమా ఇప్పటికే 50శాతం పైగా పూర్తయ్యింది. ఇప్పటికే సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్లాల్సి ఉంది. మరీ.. చరణ్ ఎప్పుడు మేల్కోంటాడో చూడాలి.. !