‘2.ఓ’ టీజర్.. ముహూర్తం ఖరారు !

ఇన్నాళ్లు రజనీకాంత్ ‘2.ఓ’ ఎప్పుడు వస్తుందో తెలియక టెన్షన్ పడ్డారు ఆయన అభిమానులు. ఇటీవలే విడుదల -తేది ‘నవంబర్ 29’ అని ప్రకటించి ఆ టెన్షన్ ని దూరం చేసింది చిత్రబృందం. అయినా.. ప్రమోషన్స్ కార్యక్రమాలని మొదలు పెట్టకపోవడంతో అభిమానుల్లో మళ్లీ కంగారు నెలకొంది. మరోసారి ‘2.ఓ’ వాయిదా పడితే తట్టుకొనే పరిస్థితుల్లో ప్రేక్షకులు లేరు. ఆ విషయం చిత్రబృందానికి తెలుసు. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్ ని మెల్లగా మొదలెట్టేసింది. ఇటీవల ప్రత్యేకమైన ఓ మేకింగ్‌ వీడియో అంతర్జాతీయ మీడియాలో ప్రసారమైంది. టీజర్‌ విడుదలతో ప్రచార కార్యక్రమాలు హోరెత్తనున్నాయి.

ఈ నెల్లోనే టీజర్ రాబోతుందనే ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడది వినాయకచవితి సెప్టెంబర్ 13కి వాయిదా పడినట్టు సమాచారమ్. భారత దేశంలోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతోన్న చిత్రమిది. ‘రోబో’ అంతకుమించి ‘2.ఓ’లో విజువల్ ఎఫెక్ట్స్ ఉండనున్నాయట. రజనీకాంత్‌, అమీజాక్సన్‌ జంటగా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ కథానాయకుడు అక్షయ్‌కుమార్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంగీతం ఎ.ఆర్‌.రెహమాన్‌. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.