ఐఏఎస్ అధికారుల బదిలీలకు కారణం అదేనా..!?
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు సంకేతాలివ్వడంతో పాటు ఆ దిశగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఒక వ్యూహంతో ముందుకెళుతున్నారు. ఢిల్లీ పర్యటనలు, ప్రధానితో భేటీలతో పాటు ఐఏఎస్ అధికారుల బదిలీల ప్రక్రియ కూడా ఇందులో భాగమేనని చెబుతున్నారు విశ్లేషకులు. ఎన్నికల యుద్ధానికి సిద్ధమవడంలో రాజకీయంగా ఎన్ని వ్యూహాలు పన్నినా, దానికి సాంకేతిక కారణాలు కూడా కలిసిరావడం చాలా ముఖ్యం. ఏ చిన్న విషయంలోనూ తప్పు దొర్లకుండా, పక్కా వ్యూహంతో అన్ని చక్కదిద్దే పనిలో పడ్డారు కేసీఆర్.
ఎన్నికల్లో సాంకేతికంగా తమకు అనుకూలంగా పనిచేసే అధికారులు ఉండటం కూడా ముఖ్యమని కేసీఆర్ భావించినట్లుగా చెబుతున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త వహిస్తున్నారట ముఖ్యమంత్రి. నిబంధనల ప్రకారం రెండు, మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఐఏఎస్ అధికారులను బదిలీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడా పని చేయకపోతే ఎన్నికల అధికారి బదిలీలు చేసే అవకాశం ఉంటుందట. అలా చేస్తే ఎవరు ఎటు బదిలీ అవుతారో తెలియదు కాబట్టి ఆ పని ఇప్పుడే ప్రారంభించారట కేసీఆర్. అందుకే జీహెచ్ఎంసీ పరిధిలో జీహెచ్ఎంసీ కమిషనర్ ను హెచ్ఎండీఏ కమిషనర్ గా, హెచ్ఎండీఏ కమిషనర్ ను జీహెచ్ఎంసీ కమిషనర్ గా బదిలీ చేసి మమ అనిపించుకున్నారట.
మొత్తంగా ఆ అధికారులను హైదరాబాద్ పరిధిలోనే ఉంచి బదిలీ ప్రక్రియను పూర్తి చేశారట. వీటితో పాటు వివిధ జిల్లాల్లో ఐఏఎస్ లను కూడా బదిలీలు చేయాలని ప్రభుత్వం బావిస్తోందట. రెవెన్యూ డిపార్ట్ మెంట్ లో కూడా ఒకే చోట్ రెండేళ్లు, అంతకంటే ఎక్కువకాలం కొనసాగుతున్న అధికారుల జాబితాను పంపించాలని ప్రభుత్వం ఇప్పికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా వ్యూహాత్మక అడుగులు వేస్తూ పక్కా ప్రణాళికతో కేసీఆర్ ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఉన్నఫలంగా జరుగుతున్న ఐఏఎస్ అధికారుల బదిలీలకు కారణం ఇదేనని రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.