‘అమర్ అక్భర్ ఆంథోని’ ఫస్ట్ లుక్

చాన్నాళ్లు వరుస ప్లాపులతో సతమతమయిన రవితేజ ‘రాజా ది గ్రేట్’ హిట్ తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చాడు. ఐతే, ఆ వెంటనే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘టచ్ చేసి చూడు’ తీవ్రంగా నిరాశపరిచింది. ఆ తర్వాత వచ్చిన ‘నేల టికెట్’ ప్లాపు సినిమాగా మిగిలింది. ఈ నేపథ్యంలో ఓ హిట్ కోసం రవితేజ మళ్లీ ప్రయత్నాలు మొదలెట్టాడు. ఇందులో భాగంగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ ‘అమర్ అక్భర్ ఆంథోని’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా, ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేసింది చిత్రబృందం. ఫ‌స్ట్ లుక్ లో హీరో పాత్ర‌ను మూడు భిన్న‌మైన గెట‌ప్స్ లో చూపించారు. ర‌వితేజ కూడా తొలిసారి త‌న కెరీర్ లో ఇలా భిన్న‌మైన కోణాలున్న పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. శ్రీనువైట్ల త‌న గ‌త సినిమాల‌కు పూర్తిభిన్నంగా.. స‌రికొత్త జోన‌ర్ లో అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీని తెర‌కెక్కిస్తున్నారు.

ఈ సినిమాతో ఇలియానా టాలీవుడ్ కు రీ-ఎంట్రీ ఇవ్వనుంది. సునీల్ కమెడియన్ గా రీ-ఎంట్రీ ఇచ్చి నటిస్తున్న చిత్రాల్లో ఇదొక్కటి. ల‌య‌, వెన్నెల కిషోర్, ర‌ఘుబాబు, త‌రుణ్ అరోరా, అభిమ‌న్యు సింగ్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షెడ్యూల్ అమెరికాలోని న్యూయార్క్ లో జ‌రుగుతుంది. ఈ చిత్రానికి ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం. మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని అక్టోబ‌ర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.