నటుడిగా హరికృష్ణ శైలి ప్రత్యేకం..
ఎన్టీఆర్ తనయుడిగా సినిమాల్లోకి ప్రవేశించిన హరికృష్ణ తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకున్నారు. బాల నటుడిగా రంగప్రవేశం చేసిన హరికృష్ణ హీరోగా, నిర్మాతగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు పాత్రలు పోషించారు. బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నందిఅవార్ట్ కూడా అందుకున్నారు. ‘శ్రీకృష్ణావతారం’ సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. కమలాకర కామేశ్వర రావ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం1964లో విడుదలైంది. ఈ చిత్రంలో హరికృష్ణ చిన్ని కృష్ణుని పాత్రలో కనిపించారు. తరువాత వచ్చిన ‘తల్లా పెళ్లమా’ చిత్రంలో కూడా బాల నటుడిగా కనిపించారు.
బాల నటుడిగా అలరించిన హరికృష్ణ అనంతరం ‘తాతమ్మ కల’, ‘రామ్ రహీమ్’ చిత్రాల్లో సోదరుడు బాలకృష్ణతో కలిసి నటించారు. ఈ రెండు చిత్రాలు 1974లో విడుదలయ్యాయి. ఆ తర్వాత 1977లో వచ్చిన ‘దానవీరశూరకర్ణ’ చిత్రంలో అర్జునుడి పాత్రలో కనిపించారు. ‘తాతమ్మ కల’, ‘దానవీరశూరకర్ణ’ చిత్రంలో సోదరుడు బాలకృష్ణతో పాటు తండ్రి ఎన్‌టీఆర్ కూడా ఉండటం విశేషం. 1977 తర్వాత హరికృష్ణ మరే చిత్రంలో నటించలేదు.
ఎన్టీఆర్ మృతి చెందిన తర్వాత హరికృష్ణ తిరిగి సినిమాల్లో ప్రవేశించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత 1998లో మోహన్‌బాబు హీరోగా వచ్చిన ‘శ్రీరాములయ్య’ చిత్రంతో సిని పరిశ్రమలో పునరాగమనం చేశారు. ఈ చిత్రంలో హరికృష్ణ ‘కామ్రెడ్ సత్యం’ పాత్రలో కీలక పాత్ర పోషించారు. తర్వాత ఏడాది వచ్చిన ‘సీతారామ రాజు’ చిత్రంలో, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘శివరామ రాజు’ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. వీటిలో ‘లాహిరి లాహిరి లాహిరి’లో చిత్రానికి గాను హరికృష్ణ ‘బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్’ కేటగిరిలో నంది అవార్డు అందుకున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పాత్రల్లో నటించిన హరికృష్ణ 2003లో వచ్చిన ‘సీతయ్య’, ‘టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్’ చిత్రాల్లో హీరోగా నటించారు. ‘సీతయ్య’ చిత్రంలో హరికృష్ణ చెప్పిన ఎవరి మాట వినడు సీతయ్య డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిన సంగతే. తరువాత వచ్చిన ‘స్వామి’, ‘శ్రావణమాసం’ హరికృష్ణ చివరి చిత్రాలు.