రోడ్డు ప్ర‌మాదంలో నంద‌మూరి హ‌రికృష్ణ మృతి.

సినీ న‌టుడు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నంద‌మూరి హ‌రికృష్ణ రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందారు. న‌ల్గొండ జిల్లా అన్నెప‌ర్తి వ‌ద్ద ఈ రోడ్డుప్ర‌మాదం జ‌రిగింది. హైద‌రాబాద్ నుంచి నెల్లూరుకు ఓ వివాహ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యేందుకు వెళ్తున్న హ‌రికృష్ణ అన్నెప‌ర్తి ద‌గ్గ‌ర డివైడ‌ర్ ను డీకొట్టి కారు ప‌ల్టీలు కొడుతూ రోడ్డు ప‌క్క‌కు ప‌డిపోయింది. దీంతో కారులోంచి బ‌య‌ట‌కు ప‌డిపోయిన హ‌రికృష్ణ త‌ల‌కు తీవ్ర‌గాయాల‌య్యాయి. వెంట‌నే నార్క‌ట్ ప‌ల్లి కామినేని ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ ఆయ‌న తుది శ్వాస విడిచారు. ప్ర‌మాదానికి అతివేగ‌మే కార‌ణంగా తెలుస్తోంది.

గతంలో హరికృష్ణ పెద్ద కుమారుడు నందమూరి జానకి రామ్ నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. 2009 ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తూ జూనియర్ ఎన్టీఆర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అదృష్టవశాత్తూ ఎన్టీఆర్ ప్రాణాలు దక్కాయి. అప్పట్లో ఎన్టీఆర్‌కు రోడ్డు ప్రమాదం జరగిన ప్రాంతంలోనే జానకి రామ్ కారు ప్రమాదానికి గురి అయింది. ఇప్పడు హరికృష్ణకు కూడా అదే జిల్లాలో ప్రమాదం జరిగింది. ఈ విషయం నందమూరి అభిమానులను షాక్‌కు గురి చేస్తోంది.