హ‌రికృష్ణ వ్య‌క్తిత్వాన్ని ఆవిష్క‌రించిన కీర‌వాణి ట్వీట్.

.

నందమూరి హరికృష్ణ బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో హ‌రికృష్ణ‌తో త‌మ‌కున్న అనుబంధాన్ని, వ్య‌క్తిగా ఆయ‌న ఎంత‌టి ఉన్న‌త‌మైన వ్య‌క్తో గుర్తు చేసుకుంటూ జ్ఞాప‌కాల‌ను పంచుకుంటున్నారు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులంతా. హ‌రికృష్ణ భేష‌జాలు లేని వ్య‌క్తిత్వాన్ని చాటే ఒక సంఘ‌ట‌న‌ను ట్విట్ట‌ర్ ద్వారా పంచుకున్నారు ప్ర‌ముఖ‌ సంగీత ద‌ర్శ‌కులు ఎంఎం కీర‌వాణి. ఆయ‌న గురించి ఒక ఆసక్తిక‌ర విష‌యాన్ని ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు.

స్వర్గీయ నందమూరి తారకరామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్ లో హరికృష్ణ కారులో వెళుతున్నారట‌. ముషీరాబాద్ లో సిగ్నల్ జంప్ చేశాడనే కారణంతో ట్రాఫిక్ పోలీస్ ఆయన వాహనాన్ని ఆపేశారు. తాను ఆపింది ముఖ్యమంత్రి తనయుడి వాహనమ‌ని ఆ పోలీసుల‌కు తెలియ‌దు. అయినా హ‌రికృష్ణ ఎలాంటి భేష‌జాల‌కు పోకుండా జ‌రిమానా క‌ట్టి అక్క‌డి నుంచి వెళ్లిపోయాడ‌ట‌. త‌ప్పు త‌న‌దే కావ‌డంతో జ‌రిమానా క‌ట్టి వెళ్లిపోవ‌డమే కాకుండా, తాను ముఖ్య‌మంత్రి కుమారుడ‌న్న విష‌యం ఆ త‌రువాత కూడా అత‌డికి చెప్ప‌లేద‌ట‌. భేష‌జాలు లేని మ‌నిషి హ‌రికృష్ణ అంటూ కీర‌వాణి ట్విట్ చేశారు.