తండ్రికి తగ్గ తనయుడు
నల్గొండ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ తనయుడు, సినీ నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ (61) మృతి చెందిన సంగతి తెలిసిందే. హరికృష్ణ అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జూబ్లిహిల్స్‌లోని మహాప్రస్థానంలో హరికృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి హరికృష్ణ అంతిమయాత్ర ప్రారంభం కానుంది.
ఈ ఉదయం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హరికృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకయ్య.. హరికృష్ణ తండ్రికి తగ్గ తనయుడు. నీతిగా, నిక్కచ్చిగా వ్యవహరించే వ్యక్తి. ఏ విషయం చెప్పాల్సి వచ్చినా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేవారని అన్నారు. రాజ్యసభ సభ్యుడిగా హరికృష్ణ ఉన్న సమయంలో తాను తెలుగులోనే మాట్లాడుతానని పంతం పట్టారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా ఎంతో అన్యాయం జరుగుతోందని హరికృష్ణ ఆవేదన చెందారని వెంకయ్య చెప్పారు. అంతకు ముందు నటులు నాగార్జున, జగపతిబాబు, అర్జున్, బెనర్జీ, దర్శకుడు రాఘవేంద్రరావు తదితరులు హరికృష్ణ మృతదేహానికి నివాళులు అర్పించారు.