‘ముందస్తు’పై అమిత్ షా అదే చెప్పారు..
నాలుగు సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 18వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని, నిరుద్యోగ యువత రాష్ట్ర ప్రభుత్వంపై కోపంతో ఉన్నారని కేంద్రమాజీ మంత్రి, బీజేపీ ఎంపీ దత్తాత్రేయ అన్నారు. కిందిస్థాయిలో టీఆర్ఎస్ పై తీవ్ర వ్యతిరేకత ఉందని, డముల్ బెడ్రూంలకోసం ప్రజలు తిడుతున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందనే కేసీఆర్ ముందస్తుకు వెళుతున్నారని, బీజేపీ ఎన్నికలకు సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.
ముందస్తు ఎన్నికలు తథ్యమని, అందుకు పార్టీని సమాయత్తం చేయాల్సిందిగా బీజేపీ జాతీయ అద్యక్షులు అమిత్ షా చెప్పారని , రాష్ట్రంలో నవంబర్, డిసెంబర్ లో ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తోందని ఆయన అన్నారు. టీఆర్ఎస్, బీజేపీ పొత్తు అనే ప్రశ్న ఉత్పన్నం కాదని, అవి అసంబద్ధ వార్తలని ఆయన తేల్చి చెప్పారు. 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులను తయారు చేయాలని పార్టీ ఆదేశించిందని, రెండు నెలలుగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నామని ఆయన చెప్పారు.