స‌భా వేదిక నుంచి కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న‌..!

ముంద‌స్తు ఎన్నిక‌ల సంకేతాల నేప‌థ్యంలో టీఆర్ఎస్ రాజ‌కీయ భ‌విష్య‌త్ కు సంబంధించి కీల‌క విష‌యాల‌ను ప్ర‌గ‌తి నివేదిక స‌భ‌లో సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు భావిస్తున్నాయి. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ప్ర‌గ‌తి నివేదిక స‌భకు ఏర్పాట్లు పూర్తి చేసుకుని, కొన్ని ప్రాంతాల నుంచి ఇప్ప‌టికే బ‌య‌లుదేరిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

టీఆరెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఓన్ చేసుకున్నారని, అందుకే ప్రగతి నివేదిక సభకు ప్రజలు తండోపతండాలుగా స్వచ్ఛందంగా తరలుతున్నారని మంత్రి హ‌రీష్ రావు అన్నారు. టీఆర్ఎస్ పార్టీ సభ నిర్వహిస్తే ప్రతిపక్షాలు వణుకుతున్నాయని, ప్రతిపక్షాల విమర్శలకు సభా వేదిక నుంచి సీఎం కేసిఆర్ ధీటైన సమాధానం చెబుతారని ఆయ‌న చెప్పారు.

తమ ప్రభుత్వం ఈ నాలుగున్నర ఏండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామ‌ని, ప్రగతి నివేదిక సభకు ట్రాక్టర్లలో వచ్చే వారు ఈ రోజే తరలి రావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాక్టర్లకు అనుమతి ఉండదని చెప్పారు హ‌రీష్. సభకు ఎంతమంది తరలి వచ్చినా ఇబ్బంది కలుగ కుండా అన్ని ఏర్పాట్లు చేశామ‌ని, సభా వేదిక నుంచి కీలక ప్రకటనలకు సంబంధించి కొద్ది గంటల్లో తేలిపోతుంద‌ని హ‌రీష్ చెప్పారు. తినబోతు రుచులెందుక‌ని, ఏమున్నా ముఖ్యమంత్రి కేసీఆరే ప్రకటిస్తారని మంత్రి హ‌రీష్ రావు చెప్పారు.