తిరిగి షూటింగ్’కు తారక్
నాన్న ప్రేమను తెలుగు ప్రజలకు గుర్తు చేసిన కథానాయకుడు ఎన్టీఆర్. ఆయనకు తండ్రంటే ప్రాణం. ఆ ఇష్టంతోనే ‘నాన్నకు ప్రేమతో’ సినిమాని ఇష్టపడి మరీ చేశాడు. ఐతే, ఇప్పుడు తారక్’కు నాన్న దూరమయ్యాడు. నల్లొండ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం హరికృష్ణ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆ తర్వాత జరగాల్సిన కార్యక్రమాలని కళ్యాణ్ రామ్, తారక్ లు దగ్గరుండి చూసుకొంటున్నారు.
ఈ షాక్ నుంచి నందమూరి ఫ్యామిలీ ఇప్పట్లో తేరుకొనేలా లేదు. ఈ బాధ నుంచి బయటపడటానికి కళ్యాణ్ రామ్, తారక్ లు షూటింగ్ లో బిజీ అయిపోనున్నారు. తారక్ ఈ రోజు నుంచే తిరిగి ‘అరవింద సమేత’ షూటింగ్ లో పాల్గొననున్నారు. దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల్సిన ఈ సినిమాని జెడ్ స్వీడుతో షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు దర్శకుడు త్రివిక్రమ్. కళ్యాణ్ రామ్ కూడా.. సెప్టెంబర్ 3 నుంచి షూటింగ్ లో జాయిన్ కానున్నారు.