తమ్ముడుకి అన్నయ్య ఆశీస్సులు

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆదివారం (సెప్టెంబర్ 2) తన 46వ పుట్టినరోజుని జరుపుకొన్నారు. ప్రత్యేకంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం పవన్ కు అలవాటు లేదు. ఆయన అభిమానులు మాత్రం ఓ పండగలా జరుపుకొంటుంటారు. ఈ యేడాది పవన్ పుట్టినరోజుని ఘనంగా జరుపుకొన్నారు అభిమానులు. సోషల్ మీడియా వేదికగా పవన్ ని విష్ చేశారు.

అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి పవన్ కు శుభాకాంక్షలు వెలువెత్తాయి. మంత్రి నారా లోకేష్, దర్శకుడు కొరటాల, రామ్ చరణ్, అల్లు అర్జున్.. తదితరులు పవన్ ని విష్ చేశారు. వీరిలో రామ్ చరణ్ ఏకంగా పారాచూట్ జంప్ చేసి బాబాయ్ పుట్టినరోజు సందర్భంగా సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఇక, అన్నయ్య చిరంజీవి నుంచి పవన్ కు ఆశీస్సులు లభించాయి.

ఐతే, చిరు స్వయంగా పవన్ ని కలిసి శుభాకాంక్షలు తెలుపుతారని భావించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ఫేస్ బుక్ పేజీ ద్వారా చిరు పవన్ ని విషెస్ చెప్పారు. వాస్తవానికి పవన్ ని కలవాలని భావించారు. ఐతే, పవన్ అందుబాటులో లేరని తెలిసి సోషల్ మీడియా ద్వారా ఆశీస్సులు అందించారు. దీనిపై చిరు వివరణ కూడా ఇచ్చారు. “కళ్యాణ్ బాబు.. నువ్వు అందుబాటులో లేవని తెలిసింది, కలవాలని అనుకొని విరమించాను . పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ హనుమాన్, నీకు మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని మరియు మనశ్శాంతిని ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాను . ఆశీస్సులతో.. అన్నయ్య చిరంజీవి’ అని పోస్ట్ పెట్టారు.

ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పవన్ ఫ్యామిలీతో కలిసి అన్నయ్యకి శుభాకాంక్షలు తెలిపారు. ఆ సందర్భంగా అన్న-తమ్ముళ్లని ఓకే చోట చూసుకొని మెగా అభిమానులు మురిసిపోయారు. ఆదివారం పవన్ బర్త్ డే కానుకగా అలాంటి సీన్ రీపీట్ కానుందని మెగా అభిమానులు భావించారు. ఐతే, పవన్ అందుబాటులో లేకపోవడంతో.. సోషల్ మీడియా ద్వారా తమ్ముడికి ఆశీస్సులు అందించారు చిరు. చిరు ఎమోషనల్ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.