18ఏళ్లు వెనక్కి వెళ్లిన కేసీఆర్..!
ప్రగతి నివేదన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం గత స్మృతులతో మొదలైంది. సభకు వచ్చిన జనాన్ని చూసి తనకు 18ఏళ్ల క్రితం పరిస్థితి గుర్తుకు వస్తుందని చెప్పారు. జనమా.. ప్రభంజనమా అనే విధంగా సభకు జనం వచ్చారని అన్నారు కేసీఆర్.. సమైక్య పాలనలో తెలంగాణలో సంక్షేమం కుంటుపడిందని, పిడికెడు మందితో ప్రతిజ్ఞ చేసిన తాను ఏ నాడు మాట తప్పలేదని గుర్తు చేశారు సీఎం.
తెలంగాణలో సబ్బండ వర్గాల అభివృద్ధికి ప్రణాళికతో ముందుకెళ్లామని, నాలుగేళ్లలో అందరికీ సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం చూసిందని అన్నారు. జోలె పట్టి నేతన్నలను ఆదుకున్న రోజుల నుంచి నేతన్నకు చేయూతనిచ్చిన ఘనత ప్రభుత్వానిదని గుర్తు చేశారు. ముస్లిం మైనారిటీతో పాటు వివిధ కులాల సంక్షేమానికి ఎంతో చేసిందని, రైతులకు రైతుబంధు, భీమా లాంటి కార్యక్రమాలను తీసుకువచ్చిందని చెప్పారు. మిషన్ భగీరథ ఇప్పటికే 46శాతం పూర్తయిందని, ఎన్నికల నాటికి పూర్తిగా ఇంటింటికి నల్లా వచ్చి తీరుతుందని అన్నారు.