‘ప్రగతి నివేదన’ తెలంగాణ భవిష్యత్ రాజకీయాలను నిర్ధేశిస్తుందా ?
మాటలతో, చేతలతో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకోవడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దిట్ట. ఉద్యమ కాలంలో అయినా , అధికారంలో ఉన్నా తను చేసే కార్యక్రమాలపై ఉత్కంఠ రేపేలా కార్యాచరణ రచించడంలో ఆయనకు సాటి లేరనే చెప్పాలి. ముందస్తు సంకేతాలతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచిన కేసీఆర్..ప్రగతి నివేదన సభతో తెలంగాణలో ఎన్నికల వాతావరణాన్ని సృష్టించారు. అయితే సభకు వచ్చే ముందే కేబినెట్ భేటీ నిర్వహిస్తుండటంతో కేసీఆర్ ఏం చేస్తారోననే ఉత్కంఠ సర్వత్రా వ్యక్తమవుతోంది.
ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు జరిగే కేబినెట్ భేటీపై రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. కేబినెట్ లో చర్చించే అంశాలేంటి అనేదానిపై కూడా మంత్రులు కూడా గోప్యత పాటించడం, భేటీ తరువాత సభలోనే ప్రకటిస్తారని చెబుతూ వస్తుండటం అధికారపక్షంతో పాటు విపక్ష నేతలను డైలామాలో పడేస్తోంది. ప్రగతి భవన్ లో జరిగే కేబినెట్ భేటీ తరువాత కేసీఆర్ గవర్నర్ ను కలుస్తారా నేరుగా సభకు వస్తారా అనే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. అయితే కేబినెట్ భేటీలో కొన్ని కీలక అంశాలపై చర్చించి అనంతరం గవర్నర్ ను కలిసి ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తారని ఓ వర్గం నుంచి వినిపిస్తున్న వాదన.
అందరి దృష్టి ప్రగతినివేదన వైపు ఉండేలా చేస్తూ, ఉత్కంఠ కలిగించేందుకే కేసీఆర్ ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తుంటారని మరో వర్గం చర్చించుకుంటోంది. ప్రగతినివేదన సభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో ఎన్నికల నగారా మోగిస్తే డిసెంబరులో ఎన్నికలు జరగడం తథ్యం.మంత్రి కేటీఆర్ పై కూడా ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని కూడా టీఆర్ఎస్ లో ఓ వర్గం చర్చించుకుంటోంది. కేసీఆర్ ఏం చేస్తారనేది ముందే చెప్పలేకపోయినా, ప్రగతి నివేదన సభలో కేసీఆర్ ప్రసంగం హైలెట్ నిలవడంతోపాటు, తెలంగాణ భవిష్యత్ రాకీయాలను ప్రగతినివేదన సభను నిర్దేశిస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.