ఎంపీడీఓలకు కేసీఆర్ సర్కార్ శుభవార్త.
ఎంపీడీఓల ఏళ్లనాటి కల ఫలించింది. గత ఇరవై ఒక్క ఏళ్లుగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న ఎంపీడీఓలకు టిఆర్ ఎస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎంపీడీఓల పదోన్నతుల ఫైలుపై సీయం కేసీఆర్ సోమవారం సంతకం చేశారు. దీంతో దాదాపు 130 మందికి పైగా ఎంపీడీఓలకు జెడ్పీ డిప్యూటీ సీఈఓ, సీఈఓ, డీఆర్డీఓ పోస్టులతో పాటు… హైదరాబాద్‌లోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్, ఫైనాన్స్ కమిషన్, ఈజీఎంయం కార్యాలయాల్లో అవకాశం దక్కనుంది.
దీంతో మండల వ్యవస్థ ఏర్పాటైన తర్వాత ఎంపీడీఓలకు తొలిసారి పదోన్నతులు దక్కనున్నాయి.ఇప్పటికే గ్రామ కార్యదర్శులు, ఈఓ పీఆర్డీల పదోన్నతులను పూర్తి చేసిన పంచాయతీరాజ్ శాఖలో ..తాజాగా ఎంపీడీఓల పదోన్నతులు, కొత్తగా జూనియర్ కార్యదర్శుల నియామకంతో రాబేయే రోజుల్లో గ్రామ పాలన కొత్త పుంతలు తొక్కడం ఖాయంగా కన్పిస్తోంది. ఎన్నో ఏళ్లుగా పదోన్నతుల కోసం ప్రభుత్వాలతో పోరాడుతున్నామని…తమ ఏళ్ల నాటి ఆకాంక్షను నెరవేర్చిన సీయం కేసీఆర్‌కు , పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఎంపీడీఓల అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది.