అప్పట్లో గాంధీ, బెనజీర్ బుట్టో.. ఇప్పుడు కేసీఆర్..!
పది రోజుల వ్యవధిలో ప్రగతి నివేదన సభ ద్వారా దేశంలోనే చరిత్ర సృష్టించామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. తెలంగాణలో జరుగుతోన్న అభివృద్దిపై దేశం చర్చించుకుంటోందని, 25లక్షల మందితో సభ సాధ్యం కాదని కొందరు వ్యక్తం చేసిన అనుమానాలను పటాపంచలు చేశామని ఆయన చెప్పారు. 1930 లో గాంధీ దండి యాత్ర , 1985లో బెనర్జీర్ బుట్టో భారతదేశానికి వచ్చినప్పుడు అత్యధికంగా జనాలు హాజరయ్యారని, ఆతర్వాత టీఆర్ఎస్ సభకు హాజరయిన ప్రజలే అత్యధికంగా ఉన్నారని చెప్పుకొచ్చారాయన.
కాంగ్రెస్ నేతల నుంచి సహజంగానే దిగజారుడు ఆరోపణలు చేస్తారని, సభ తుస్సుమందని.. ఉత్తమ్ కుమార్ రెడ్డి దివాలాకోరు మాటలు మాట్లాడారన్నారు. టీఆర్ఎస్ పార్టీకి సభలు నిర్వహించటంలో చరిత్ర ఉందని, సందర్భం ఏదైనా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సంక్షేమం గురించే ఆలోచిస్తారన్నారాయన. కాంగ్రెస్ చేయలేని పనులను టీఆర్ఎస్ పార్టీ చేసి చూపించిందని, అమరుల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదని ఆయన అన్నారు. సభకు బలవంతంగా ప్రజలను తరలించాల్సిన అవసరం తమకు లేదని, టీఆర్ఎస్ సభలో పల్లీలు అమ్ముకోవటానికొచ్చేంత మంది కూడా కాంగ్రెస్ సభలకు రావటం లేదని ఆయన ఎద్దేవా చేశారు.