‘ఎన్టీఆర్’ బాటలో ‘కేసీఆర్’…!!
ప్రగతి నివేదన సభ సక్సెస్ పై అధికార, విపక్షాలు నువ్వా నేనా అన్నట్లు ఒకరిపై ఒకరు విమర్శలు కురిపించుకుంటున్నారు. సభ సక్సెస్ అయిందని టీఆర్ఎస్ ఢంకా భజాయించి చెబుతోంటే, కాంగ్రెస్, బీజేపీ,టీజేఎస్ లు టీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్ అంటూ తేల్చి చెబుతున్నాయి. ప్రగతి నివేదన సభ సక్సెస్, ఫ్లాప్ ల విషయం పక్కనబెడితే ఇప్పుడు సభలో కేసీఆర్ వినిపించిన లోకల్ సెంటిమెంట్ పైనే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తమిళనాడు తరహాలో లోకల్ సెంటిమెంట్ ను తెలంగాణలో రగిలించి ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నారు.
ఢిల్లీకి చెంచాగిరి చేసే పార్టీలను నమ్ముదామా అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పార్టీలపై ఘాటైన విమర్శ చేశారు. ఢిల్లీకి గులాములుగా ఉందామా, తెలంగాణ గులాబీలుగా ఉందామా అంటూ ఆత్మగౌరవ నినాదాన్ని ప్రజలముందుంచారు. ఒకరకంగా చెప్పాలంటే స్వర్గీయ ఎన్టీఆర్ బాటలోనే ఆత్మగౌరవ నినాదంతో తెలంగాణలో కేసీఆర్ ముందుకెళ్లాలని చూస్తున్నారు. తమిళనాడు తరహాలో అంటూ ఉదహరించిన కేసీఆర్ తెలంగాణలో లోకల్ సెంటిమెంట్ తో ముందుకెళుతున్నారు…
తమిళనాడు రాజకీయ పరిస్థితులకు, ప్రస్తుతం తెలంగాణ రాజకీయ పరిస్థితులకు పోలీక చూసుకుంటే తెలంగాణలో తమిళనాడుకంటే రాజకీయ చైతన్యం కాస్త ఎక్కువే. గతంలో తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో పార్టీని పెట్టి ప్రభంజనం సృష్టించారు. అదే తెలంగాణ సెంటిమెంట్ తో పార్టీ పెట్టిన కేసీఆర్ మరో ప్రభంజనం సృష్టించారు. తమిళనాడులో జాతీయ పార్టీలకంటే ప్రాతీయ పార్టీల మధ్యే పోటీ ఉంటుంది. మరి తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. టీఆర్ఎస్ తరువాత ఆ స్థాయిలో కాంగ్రెస్ మాత్రమే ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. లోకల్ పార్టీలంటే ప్రస్తుతం కోదండరాం ఏర్పాటు చేసిన టీజేఎస్, గతంలో చెరుకు సుధాకర్ ఇంటిపార్టీ తప్ప టీఆర్ఎస్ కు అంత ధీటైన పార్టీలు లేవు. ఆత్మగౌరవ నినాదంతో ముందుకెళుతున్న టీఆర్ఎస్ కు లోకల్ సెంటిమెంట్ ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి మరి.