ప్రకటన : నానికి అందరూ సమానమే
బిగ్ బాస్ అభిమానులకు నాని క్షమాపణలు చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. నాని బిగ్ బాస్ 2 హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వందరోజుల బిగ్ బాస్ సీజన్ 2 ఆఖరి అంకానికి చేరుకొంది. ఐతే, మొదటి నుంచి హోస్ట్ నానిపై ఓ ఆరోపణ ఉంది. ఆయన హౌస్ సభ్యులని అందరినీ ఒకలా చూడరు. కొందరికి సపోర్టు చేస్తుంటారని ప్రచారం ఉంది. మొదట్లో దీప్తి సునైనా, ఆ తర్వాత కౌశల్.. తదితరులకు నాని అనుకూలంగా వ్యవహరిస్తున్నారనేది ఆరోపణ. ఇప్పటికీ ఆ ఆరోపణలు వస్తూనే ఉన్నాయి.
తాజాగా, ఈ ఆరోపణలపై నాని స్పందించారు. ‘మీతో ఓ విషయం పంచుకోవాలని ట్విటర్‌లోకి వచ్చా. ‘బిగ్‌బాస్’ గురించి మీరు చేసిన కామెంట్స్ చూశాను. నేను మీకు రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదని ‘బిగ్‌బాస్’ బృందం చెప్పింది. కానీ ఇవ్వకుండా ఎలా ఉండగలను. ఇదిగో షోకు సంబంధించి నా చివరి స్పందన’ అంటూ నాని ట్వీట్ చేశారు.
నాని చేసిన ప్రకటన.. “షో విషయంలో మీలో కొందరు నా వల్ల బాధపడి ఉంటే క్షమించండి. కానీ మీరు మీ కోణంలో ఆలోచిస్తున్నారు. మీకు ఇష్టమైన హౌస్‌మేట్‌ను ఎప్పుడూ ప్రత్యేకంగా చూసుకోవాలని భావిస్తున్నారు. కానీ ఓ హోస్ట్‌గా నేను మీలా ఆలోచించలేను. నావైపు నుంచి అందరికీ సమానమైన అవకాశం ఇవ్వాలి. మీరు హౌస్‌లో ఒకరికి అభిమానై ఉంటారు కాబట్టి నేను అందరికీ సమానమైన అవకాశం ఇస్తున్నప్పుడు పక్షపాతంతో వ్యవహరిస్తున్నాను అనిపించొచ్చు.
కానీ నన్ను నమ్మండి. హౌస్‌లోని ప్రతి ఒక్కరు నాకు సమానమే. మీ ఆదరణతో హౌస్‌లోని ఉత్తమ వ్యక్తి విజయం సాధిస్తారని అందరికీ తెలుసు. ఓటింగ్, ఎలిమినేషన్ విషయాల్ని నేను చూసుకుంటున్నానని మీరు అనుకుంటున్నారు. నిజంగా అందులో నా ప్రమేయం ఉంటుందని భావిస్తున్నారా?.. ఇక దాన్ని మీకే వదిలేస్తున్నా (నవ్వుతూ). ఓ నటుడిగా, వ్యాఖ్యాతగా మీకు ది బెస్ట్ ఇవ్వాలన్నదే నా ఉద్దేశం. ఈ విషయంలో నా ఆలోచనలు ఎప్పుడూ స్పష్టంగా ఉంటాయి. నన్ను ద్వేషించినా, ప్రేమించినా.. మీరంతా నా కుటుంబ సభ్యులే. మీరు నన్ను అపార్థం చేసుకుంటే దాని ప్రభావం నాపై ఉంటుంది. కానీ అది నన్ను కిందకి పడేస్తుందా? లేదు.. ఇంకా ఉత్తమంగా చేసేందుకు ప్రయత్నిస్తా. లవ్.. నాని” అని పేర్కొన్నారు.