తెలంగాణ‌లో మ‌రో కొత్త పార్టీ…! సెప్టెంబ‌రు 5న ముహూర్తం..!!

తెలంగాణ రాజ‌కీయ ముఖ‌చిత్రంలోకి మ‌రో కొత్త పార్టీ వ‌చ్చి చేరుతోంది. సెప్టెంబ‌రు 5న పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం కుదిరింది. తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర వ‌హించి, అనంత‌ర రాజ‌కీయ ప‌రిణామాలలో టీఆర్ఎస్ కు దూర‌మైన జిట్టా బాల‌కృష్ణారెడ్డి ఆధ్వ‌ర్యంలో ఈ పార్టీ ఏర్పాట‌వుతోంది. గ‌తంలో స్వ‌తంత్ర్య అభ్య‌ర్థిగా రెండు ప‌ర్యాయాలు పోటీ చేసి స్వ‌ల్ప తేడాతో ఓట‌మి చెందిన బాల‌కృష్ణారెడ్డి యువ‌జ‌న సంఘాల స్పూర్తితో కొత్త పార్టీ ఏర్పాటుకు ముందుకు వ‌చ్చారు.

రాజ‌కీయాల్లో యువ‌త కీల‌క పాత్ర వ‌హించేలా, పార్టీలో యువ‌త‌కు పెద్ద‌పీట వేస్తూ రాజ‌కీయంగా ముందుకువెళ్లాల‌ని జిట్టా భావిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువ‌జ‌న సంఘాల‌ను ఏకం చేసి తెలంగాణ జాత‌ర‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన జిట్టా ఇప్పుడు రాజ‌కీయ పార్టీతో మ‌రోసారి రాష్ట్ర ప్ర‌జ‌ల్లోకి వెళుతున్నారు. యువ‌తెలంగాణ పేరుతో ఏర్పాట‌య్యే ఈ పార్టీ సెప్టెంబ‌రు 5న ఏర్పాటుకు ముహూర్తం కుదిరింది. యువ‌త‌కు, మ‌హిళ‌ల‌కు అధిక ప్రాధాన్య‌త‌నివ్వ‌డంపై పార్టీ దృష్టి సారిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది.

జిట్టా బాలక్రిష్ణారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో 1992లో వివేకానంద యువజన సంఘం స్థాపించి, ఆ తర్వాత 1997లో రంగారెడ్డి జిల్లా యువజన సంఘాల సమితిని ప్రారంభించారు. 2000 సంవత్సరంలో రాష్ట్రంలోని యువజన సంఘాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి యువజన సంఘాల సమితి ని ఏర్పాటు చేశారు. అనంత‌ర‌ కాలంలో జిట్టా టిఆర్ఎస్, వైసిపిలో పనిచేశారు. 2010లో యువ తెలంగాణ అనే వేదికను ఏర్పాటు చేసి దాని ద్వారా తెలంగాణ కోసం తన వంతు పోరాటం జరిపారు. అప్పటినుంచి గత ఎనిమిదేళ్లుగా యువ తెలంగాణ తరుపున ఆయన కార్యక్రమాలు చేపడుతున్నారు.

తెలంగాణ రాజ‌కీయ ముఖ చిత్రంలో వ‌స్తున్న కొత్త పార్టీ యువ‌తెలంగాణ భ‌విష్య‌త్ లో ఎలా ముందుకు వెళుతుందో, ప్ర‌జ‌లు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి మరి.