నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయండి….!!
మనసులో ఏదో పెట్టుకుని నిరాధారమైన, నిజాయితీ లేని ఆరోపణలతో తనను రాజకీయంగా దెబ్బతీయాలని నిజామాబాద్ టీఆర్ఎస్ నేతలు చేసే పనులను ప్రజలు గమనిస్తున్నారని, వారు ఎప్పుడో అర్థం చేసుకున్నారని టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ అన్నారు. రాజకీయంగా తనను దెబ్బతీయడమే కాకుండా తన కుటుంబాన్ని రోడ్డుకీడ్చారని, తన కొడుకు సంజయ్ పై లేనిపోనివి కల్పించి జిల్లా యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి కేసు పెట్టించారని, ప్రభుత్వంపై ఈ కేసుపై ఎందుకు ఇంత ఇంట్రస్ట్ తీసుకుందో అర్థమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను పార్టీ వదిలి వెళితే తనపై పార్టీనేతలు కొందరు చేసిన ఆరోపణలు నిజమని ఒప్పుకున్నట్లవుతుందని, అందుకే తనంటత తాను పార్టీకి రాజీనామా చేయనని ఆయన అన్నారు. తాను పార్టీలో ఉండటం నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులకు, ఎంపీ కవితకు ఇష్టం లేకపోతే పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయాలని ఆయన కోరారు. చేతకాకపోతే తనపై ఇచ్చిన లేఖను, తీర్మాణాన్ని వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.