గ్యాస్, కరెంట్ ఉంచితం…! కాంగ్రెస్ మేనిఫెస్టో రెడీ..!!
రాబోయే ఎన్నికలు టి.ఆర్.ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కాదని, కెసిఆర్ వర్సెస్ తెలంగాణ ప్రజలని టీపీసీసీ ఉత్తమ్ అన్నారు. కొంగరకలాన్ సభ ఫెయిల్ అయ్యిందని, దాన్ని పూడ్చుకోవడానికే టి.ఆర్.ఎస్ హుస్నాబాద్ లో సభ పెడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. గత ఆరేడు నెలల నుంచి ఆయా ఆర్థిక నిపుణులను సంప్రదించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నామని ఉత్తమ్ తెలిపారు. సంక్షేమ పథకాల కోసం..పీసీసీ జీవన్ రెడ్డి కమిటీ (పెన్షన్, హౌసింగ్ కమిటి) వేశామని, దీనిపై సుదీర్ఘంగా చర్చించామని ఆయన అన్నారు.
ఈ కమిటీలో 45మంది సభ్యులు ఉన్నారని , వాళ్ళంతా చర్చించి ఒక నిర్ణయం తీసుకున్నారని ఆయన తెలిపారు. ఒకటి రెండు వారాల్లో డేటేయిల్డ్ మేనిఫెస్టో విడుదల చేస్తామని చెప్పారు ఉత్తమ్. ఇప్పటికే మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ పెండింగ్ బిల్లులు విడుదల చేస్తామని, ఇప్పటికే ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా మరో రూమ్ నిర్మాణం కోసం రెండు లక్షలు అందజేస్తామని అన్నారు ఉత్తమ్.
ఏడాదికి రెండు లక్షల మందికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామని, తెల్ల కార్డు ఉన్న వారికీ…ప్రభుత్వ స్థలం ఉంటే ప్రభుత్వ స్థలంలో, లేదంటే వాళ్ళ సొంత స్థలాలున్న చోట 5లక్షలతో ఇల్లు నిర్మిస్తామని హామీల వర్షం కురిపించారు. బీసీ, మైనార్టీలు వారి జనాభాకి అనుగుణంగా సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి, లోన్, సబ్సిడీతో సెల్ఫ్ ఎంప్లాయ్ కలిస్తామన్నారు. పీడీఎస్ సిస్టం మెరుగుపరుస్తామని, దొడ్డు బియ్యం ఎవ్వరూ తినడంలేదు కాబట్టి, రాష్ట్రంలో తెల్ల కార్డ్ ఉన్నప్రతి ఒక్కరికీ ఆరు కిలోల సన్న బియ్యం ఇస్తామని చెప్పారు.
దళిత, గిరిజన కుటుంబాలకు నెలవారీ రేషన్ ఫ్రీగా అందజేస్తామని, గోధుమ, గోధుమ పిండి, బెల్లం, పామాయిల్, చక్కర, పసుపు, చింతపండు, ఉప్పు రేషన్ షాపుల్లో అందిస్తామని, రేషన్ డీలర్లకు బకాయిలు చెల్లిస్తూ…కమిషన్ క్వింటాలుకు వంద రూపాయలు చెల్లిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని తెల్ల కార్డు హోల్డర్స్ కు 5 లక్షలు ఉచిత ప్రమాద భీమా, ఐదులక్షల ఆరోగ్య భీమా పథకం అందిస్తామన్నారు. ఆరోగ్యశ్రీ ఒక లిమిట్ వరకే ఉందని, దాంతో పాటు ఐదు లక్షలకు హెల్త్ బెన్ఫిట్స్ పెంచబోతున్నట్లు చెప్పారు.
ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందిస్తామని, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కు విద్యుత్ వెసులుబాటు కల్పిస్తామని, నాన్ టెలిస్కోపిక్ విద్యుత్ విధానంను టెలిస్కోపిక్ గా మార్చబోతున్నామని ఆయన చెప్పారు. అన్ని బీపీఎల్ కుటుంబాలకు ఆరు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా అందజేస్తామన్నారు. బాలికలకు ఉచిత సైకిల్స్ అందజేస్తామన్నారు ఉత్తమ్. గల్ఫ్ లో చనిపోయిన వారికీ ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లిస్తామని ఆయన అన్నారు.
కౌలు రైతులను కూడా రైతులుగానే భావించి అన్ని బెన్ఫిట్స్ అందిస్తామన్నారు. స్టేట్ మేనిఫెస్టోతో పాటు నియోజకవర్గ మేనిఫెస్టో విడుదలచలచేస్తామని, రైతు బంధు పథకం కొనసాగిస్తామని చెప్పారు ఉత్తమ్. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నివర్గాలకు పెద్దపీఠ వేస్తామని ఆయన అన్నారు.