ఊహాగానాల్ని నిజం చేస్తారా…! ఉత్కంఠకు తెర వేస్తారా..?
ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో నరాలు తెగే ఉత్కంఠ రేపుతున్న అసెంబ్లీ రద్దు అంశం నేటితో తేలిపోనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం అసెంబ్లీ రద్దు చేస్తారని, కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న అనంతరం, అసెంబ్లీ రద్దు చేసి గవర్నర్ కు ప్రతిని సమర్పిస్తారని గత రెండు రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ రద్దుపై అధికారపార్టీ నేతలు, మంత్రులుగానీ, అధినేత కేసీఆర్ నుంచిగానీ ఎలాంటి సంకేతాలు లేకపోయినా ప్రస్తుతం వేగంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తే మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తుకు వెళ్లడం ఖాయమనే నిర్ణయానికి వచ్చారు రాజకీయ విశ్లేషకులు.
ప్రగతి నివేదన సభ సందర్భంగా ఏర్పాటు చేసిన కేబినెట్ భేటీలోనే అసెంబ్లీ రద్దుపై కీలక నిర్ణయం ఉంటుందని, ప్రగతినివేదన సభలో ముందస్తుపై కీలక ప్రకటన వెలువడుతుందంటూ ఓరేంజ్ లో టాక్ వినిపించింది. రాజకీయ వర్గాల్లోనూ వాడి, వేడిచర్చ జరిగింది కూడా. అయితే కేబినెట్ లో అలాంటిచర్చే జరగలేదని ఆ తరువాత మంత్రులు చెప్పడం, త్వరలో రాజకీయ నిర్ణయాలుంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతినివేదన సభలో చెప్పడం ఆ నిర్ణయాన్ని వాయిదా వేసినట్టుగా భావించాల్సి వచ్చింది. ప్రగతి నివేదన సభపై అసంతృప్తిగా ఉన్నారో లేక ఎన్నికల వ్యూహంలో భాగంగా ప్రణాళిక ప్రకారం సభను ఏర్పాటు చేయాలనుకున్నారోగానీ శుక్రవారం హుస్నాబాద్ లో సభ జరుగుతుండటం కూడా మళ్లీ ఈ చర్చకు తావిచ్చింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ లక్కీ నెంబర్ 6కావడం, ముహూర్తం పరంగా ఈరోజున ఉదయం 6.45కు అసెంబ్లీ రద్దు చేస్తారంటూ కొద్దిసేపు ప్రచారం జరిగింది. అయితే గవర్నర్ షెడ్యూల్ ప్రకారం ఆయన మధ్యాహ్నం వరకు అందుబాటులో ఉండరని తెలియడంతో మళ్లీ మధ్యాహ్నం 1గంటకు కేబినెట్ భేటీ ఉంటుందని, అసెంబ్లీ రద్దు చేసి అనంతరం గవర్నర్ కలుస్తారని మరో ఊహాగానానికి తెరలేసింది. అర్థరాత్రి వరకు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి భేటీ అవడం ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ రద్దుపై తర్జన భర్జన అవుతున్నారనేది మాత్రం స్పష్టమవుతోంది.
మీడియాల్లో అసెంబ్లీ రద్దుపై ఓరేంజ్ లో కోడై కూస్తున్నా, అధికారపార్టీ సొంత మీడియా, అనుకూల మీడియాల్లో అసలు ఈ ఊసే ఎత్తకపోవడంపై కూడా అసలు అసెంబ్లీ రద్దుపై సస్పెన్స్ నెలకొంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ రద్దు చేయరని ఖచ్చితంగా చెప్పలేకపోయినా, వ్యూహాత్మకంగానే తాను ఇలా వ్యవహరిస్తున్నారనేది మాత్రం స్పష్టమవుతోంది. మొత్తంగా గురువారంతో ఈ అసెంబ్లీ రద్దు, ముందస్తు ఊహాగానాలను పటాపంచలు చేసి ఉత్కంఠకు తెరవేస్తారా లేక ఆసస్పెన్స్ ను ఇంకా కొనసాగిస్తారా చూడాలి మరి..