తారక్-సునీల్ కామెడీ అదుర్స్


త్రివిక్రమ్-తారక్’ల ‘అరవింద సమేత’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఫ్యాక్షన్, యాక్షన్ తారక్ కి కొట్టిన పిండి. ఇక, పంచ్ డైలాగ్స్, ఫ్యామిలీ ఎలిమిమెంట్స్ ని అద్బుతంగా చూపించడం త్రివిక్రమ్ ప్రత్యేకత. ఈ రెండూ ‘అరవింద సమేత’లో హైలైట్ కానున్నాయట. ఇదీగాక, తారక్, సునీల్ లు కలిసి చేసే కామెడీ ‘అదుర్స్’ అంటున్నారు. ఇందులో తారక్, సునీల్ లు గురుశిష్యులుగా కనిపించబోతున్నారంట. సునీల్ ని తారక్ ‘గురువుగారు.. గురువుగారూ.. ‘ అని పిలుస్తూ చేసే కామెడీ కడుపుబ్బ నవ్విస్తుందట. ‘అదుర్స్’ సినిమాలో చారి పాత్ర తరహా వినోదం అన్నమాట. అక్కడ బ్రహ్మానందం.. ఇక్కడ సునీల్ అంతే తేడా అని చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన దేవాలయం సెట్ లో దేవుడిపై వచ్చే ఓ సాంగ్ ని తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత చిత్రబృందం యూరప్ వెళ్లనుంది. అక్కడ ఓ పాటని చిత్రీకరించనున్నారు. మరోవైపు, డబ్బింగ్, రీ-రికార్డింగ్ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ నెలాఖరులోగా మొత్తం షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులని పూర్తి చేసే విధంగా త్రివిక్రమ్ ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. తారక్ సరసన పూజా హెగ్డే జతకట్టనుంది. థమన్ సంగీతం. రాథాకృష్ణ నిర్మాత. దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా విడుదల కానుంది.