కొన్ని గంటల్లో.. అసెంబ్లీ రద్దు ?
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ మధ్యాహ్నం జరగనుంది. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యతని సంతరించుకొంది. ఈ సమావేశంలో ప్రధానంగా అసెంబ్లీ రద్దుపై కీలక ప్రకటన చేసే అవకాశమున్నట్లు సమాచారం. దీంతోపాటు.. ఉద్యోగుల మధ్యంతర భృతిపై కేబినేట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. బుధవారం ప్రగతి భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఇతర ఉన్నతాధికారులతో సీఎం సమావేశమై ఇదే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. గురువారం మంత్రులందరూ హైదరాబాద్లో అందుబాటులో ఉండాలని ఇప్పటికే సీఎం కార్యాలయం సమాచారమందించారు.
మరోవైపు, ముందస్తు ఖాయమని ప్రతిపక్షాలు ఫిక్సయినట్టు కనబడుతోంది. కాంగ్రెస్ ఏకంగా ఎన్నికల మేనిఫెస్టోని ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ప్రజలకు గ్యాస్, కరెంట్ ఫ్రీ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ బుధవారం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే బీజేపీ ముందస్తు ఖాయమని తెలిపింది. ఆ పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ డిసెంబర్ లోనే ఎన్నికలంటూ ముందే కూశారు. వీటన్నింటిపై క్లారిటీ రావాలంటే.. మరికొన్ని గంటలు ఆగాల్సిందే.