టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో టిక్కెట్ టెన్షన్..
అసెంబ్లీ రద్దుపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారన్న వార్తల నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పలువురు ఎమ్మెల్యేలకు ఫోన్స్ వచ్చిన నేపథ్యంలో వారంతా ప్రగతిభవన్ కు చేరుకుంటున్నారు. తమ టిక్కెట్ పై ఇప్పటి వరకు హామీ లభించని పలువురు నేతల్లో టెన్షన్ మరింత పెరుగుతోంది. అసంతృప్తులు, టిక్కెట్ రాని నేతలను బుజ్జగించే పని మంత్రి కేటీఆర్ కు అప్పగించారు కేసీఆర్.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే లు కొండా సురేఖ, మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావ్ ప్రగతి భవన్ కు చేరుకుంటున్నారు. తెలంగాణ భవన్ కి రావలసిందిగా జనగామ ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, పలువురు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్యే లకు పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. బుధవారం సీఎం ను కలిసి ఎన్నికల్లో చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభకు టికెట్ ఇవ్వద్దని ఫిర్యాదు కొతమంది పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. మొత్తంగా పార్టీ అధిష్టానం పిలుపుతో కొంతమంది ఎమ్మెల్యేలలో టిక్కెట్ టెన్షన్ మొదలైనట్లుగా కనిపిస్తోంది.