కాంగ్రెస్ కు షాకిచ్చిన కేటీఆర్.. టీఆర్ఎస్ లోకి మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి..
అసెంబ్లీ రద్దు తరువాత ఎలక్షన్ పాలిటిక్స్ ను మొదలెట్టేసింది టీఆర్ఎస్. ఆపరేషన్ ఆకర్ష్ ను మళ్లీ తెరపైకి తీసుకువచ్చింది. కేటీఆర్ స్వయంగా సారథ్యం వహిస్తూ ఈ ఆకర్ష్ విజయవంతం చేసే పనిలో పడ్డారు. విపక్ష కాంగ్రెస్ కు షాక్ ఇచ్చేలా టీఆర్ఎస్ గేమ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కేటీఆర్ స్వయంగా సురుష్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశారని, సురేష్ రెడ్డి ని టీఆర్ఎస్ లోకి ఆహ్వానించామని, తమ ఆహ్వానాన్ని మన్నించి టీఆర్ఎస్ లోకి వస్తామన్న సురేష్ రెడ్డికి ఆయన స్థాయి తగ్గకుండా కేసీఆర్ గౌరవిస్తారని కేటీఆర్ అన్నారు.
కాంగ్రెస్ తో తనది సుదీర్ఘ రాజకీయ జీవితమని, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి విప్లవం నడుస్తోందని అందుకే టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు సురేష్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీ టికెట్లు ఇప్పటికే ప్రకటించారని, ప్రభుత్వ పథకాలు కొనసాగాలంటే టీఆర్ఎస్ మళ్ళీ రావాలని, కేసీఆర్ తో 1989 నుంచి పరిచయం ఉందని ఆయన అన్నారు. తన రాజకీయ అవసరాలు ఇప్పుడు ముఖ్యం కాదని, అభివృద్ధే ముఖ్యమని ఆయన తెలిపారు. ప్రభుత్వ పథకాలు వేగంగా అమలు కావటానికి తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి పిలుపు మేరకు టీఆర్ఎస్ ను బలపరుస్తానని, తనను నమ్మిన ఆర్మూర్, బాల్కొండ, నిజమాబాద్ ప్రజల కోసం పనిచేస్తానని చెప్పారు.