తెలంగాణ కల్వకుంట్లవారి ఇల్లు కాదు..!
కొండా సురేఖ టీఆర్ఎస్ పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగరేశారు. పార్టీలో పొమ్మనలేక పొగబెడుతున్నారని, టిక్కెట్ ప్రకటించలేదని ఆమె ఆరోపించారు. కేటీఆర్ ఒక కోటరీని నిర్మించుకుంటున్నారని, అందుకే తమలాంటి వాళ్లను పక్కనబెట్టాలని చూస్తున్నారని ఆమె అన్నారు. పార్టీకి తాను ఏం నష్టంచేశానో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. 24గంటల్లోగా సమాధానం ఇవ్వకపోతే బహిరంగ లేఖ ఇస్తానని, అనంతరం తన రాజకీయ భవిష్యత్ పై నిర్ణయం తీసుకుంటానని ఆమె చెప్పారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసినా తాము గెలుస్తామని ఆమెఅన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకే టిక్కెట్లు ప్రకటించకపోవడం వెనక కేసీఆర్ ఉద్దేశమేమిటని ఆమె ప్రశ్నించారు. తెలంగాణ కల్వకుంట్లవారి ఇల్లు కాదని ఆమె అన్నారు. గతంలో కేసీఆర్ మంత్రి పదవి ఇస్తానని చెప్పి పార్టీలోకి ఆహ్వానించారని, మహిళ కేబినెట్ లో లేకుండా పరిపాలించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని ఆమె విమర్శించారు.