బంద్.. బంద్.. భారత్ బంద్ !

పెట్రో ధరల పెరుగుదలకు నిరసనగా కాంగ్రెస్‌, వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు నేడు దేశ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. కాంగ్రెస్ తో పాటుగా 21 పార్టీలు బంద్ కు మద్దతుకు తెలిపాయి. బంద్‌ కారణంగా కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఒడిశా సంబల్‌పూర్‌లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రైల్‌రోకో నిర్వహిస్తున్నారు. కోల్‌కతాలో బంద్‌ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. బంద్‌తో అన్ని రాష్ట్రాల్లోనూ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బస్‌ డిపోల ముందు వామపక్షాల నాయకులు నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు, నిరసనకు దిగుతున్న నేతలని పోలీసులు అదుపులోని తీసుకోవడం జరుగుతోంది.

ఇక, తెలుగు రాష్ట్రల్లో బంద్ కొనసాగుతోంది. ఏపీలో వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు బంద్‌కు మద్దతు ఇస్తున్నాయి. రాజమండ్రి, కడప, వైజాగ్‌, తదితర ప్రాంతాల్లో వామపక్షాల నేతలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. డిపోల వద్ద నిరసనలు తెలుపుతూ బస్సులను అడ్డుకున్నారు. తెలంగాణలో ఖమ్మం, నాగర్‌కర్నూల్‌, నల్గొండ, హన్మకొండలలో వామపక్షాలు ఆందోళనలకు దిగాయి. కాంగ్రెస్‌, టీడీపీ, వామపక్షాల నేతలు బస్‌ డిపోల వద్ద నిరసన తెలుపుతూ బస్సులను అడ్డుకుంటున్నారు