జగ్గారెడ్డిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు.
మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై సోమవారం ఉదయం 10 గంటలకు మార్కెట్ పోలీస్ స్టేషన్ కు పక్కా ఆధారాలతో సమాచారం అందిందని హైదరాబాద్ నార్త్ జోన్ డీసీపీ సుమతి తెలిపారు. జగ్గారెడ్డి అరెస్టుకు సంబంధించి ఆమె వివరాలు వెల్లడించారు. జగ్గారెడ్డి కుటుంబ సభ్యుల పేర్లతో నకిలీ పాస్ పోర్టులు పొంది అమెరికా తీసుకెళ్లారని, దీనికి గాను పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టాయని ఆమె తెలిపారు.
అన్ని డాక్యుమెంట్లు నకిలీ సృష్టించి, జగ్గారెడ్డి భార్య నిర్మల, కూతురు జయలక్ష్మి, కొడుకు భరత్ సాయి రెడ్డి పేర్లతో వేరే వాళ్లు అమెరికా వెళ్లారని చెప్పారు పోలీసులు. 2004 నాటికి జగ్గారెడ్డి కూతురు జయలక్ష్మి ఏడేళ్ల వయస్సు ఉంటే పాస్ పోర్టులో మాత్రం 17 ఏళ్లుగా చూపించారని తెలిపారు. జగ్గారెడ్డి భార్య నిర్మల ఫోటో మార్చారని ఆమె అన్నారు. ఆధార్ డాటా బేస్ ఆధారంగా పక్కా ఆధారాలు సేకరించామని, 15 లక్షల డబ్బులు తీసుకున్నట్టుగా తేలిందని తెలిపారామె.
2004 లో ఎమ్మెల్యే గా ఉండి లెటర్ హెడ్ వాడి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, జగ్గారెడ్డి ని సికింద్రాబాద్ 22 వ మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్నట్లు చెప్పారు. బ్రోకర్ మధు సమక్షంలో జగ్గారెడ్డి నకిలీ పాస్ పోర్టులు పొందారని, ఈ కేసులో నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేశామని, మరిన్ని ఆధారాల కోసం జగ్గారెడ్డిని పోలీస్ కస్టడీకి కోరుతామని చెప్పారు డీసీపీ సుమతి.