తెరపైకి పాత కేసులు….! కాంగ్రెస్’ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకేనా !?
జగ్గారెడ్డి అరెస్టుతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ ఎదురైంది. ఎన్నికల సంగ్రామానికి సమాయత్తం చేసుకునే పనిలో పడిన కాంగ్రెస్ కు అధికార పార్టీ సడన్ ట్విస్ట్ ఇచ్చిందనే చర్చ ప్రస్తుతం రాజకీయవర్గాల్లో మొదలైంది. ఎప్పుడో 2004లో కేసు అకస్మాత్తుగా తెరపైకి రావడం, అరెస్టు జరిగిపోవడం, జరుగుతున్న పరిణామాణాలు గమనిస్తే ఇది ఖచ్చితంగా రాజకీయ కుట్రలో భాగమేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది విపక్ష కాంగ్రెస్. విపక్షాలకు ఏమాత్రం సమయం ఇవ్వకుండా వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నటీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేయడంలోనే కాదు విపక్ష పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేసుందుకూ ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది.
ముందస్తు ఎన్నికలకు ముందస్తు వ్యూహాన్ని సిద్ధం చేసుకున్న అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి అస్సలు టైం ఇవ్వకూడదనే ఆలోచనతో ముందుకెళుతున్నట్లుగా ప్రస్తుత పరిణామాలను గమనిస్తే అర్థమవుతోంది. ఎన్నికల పొత్తులు, అభ్యర్దుల ఖరారుపై దృష్టి సారించిన కాంగ్రెస్ మూడ్ ను ఒక్కసారిగా జగ్గారెడ్డి అరెస్టుతో డైవర్ట్ చేసినట్లయింది. జగ్గారెడ్డితో పాటు అవకాశం ఉన్నంత మేర కాంగ్రెస్ నేతలను జైల్లో పెట్టాలనే ప్లాన్ తో ఉన్నట్లుగా ఇప్పటికే విపక్ష కాంగ్రెస్ నేతలు ఊహించారు. ట్విస్టు మీద ట్విస్టుతో కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఎన్నికల యుద్ధంలో మైండ్ గేమ్ తో టీఆర్ఎస్ ముందుకెళుతున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లోనూ అధికార, విపక్షాలపై ఓ చర్చ మొదలైంది. సడన్ గా కాంగ్రెస్ నేతల అరెస్టులతో తెలంగాణలో ఎన్నికల చర్చకంటే ఎక్కువగా జగ్గారెడ్డి అంశమై చర్చనీయాంశంగా మారింది. ఊహించని ప్రకటనలు, పరిణామాలతో ఇటు జనాన్ని, అటు విపక్షాలను ఆలోచించుకునే సమయం లేకుండా చేయడంలో కేసీఆర్ దిట్ట అని కొంత మంది ఓ రేంజ్ లో చర్చించుకుంటున్నారు. ఇది కూడా కేసీఆర్ ఎత్తులో భాగమేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా రాజకీయ వ్యూహంలో భాగమే జగ్గారెడ్డి అరెస్టు అనేది సర్వత్రా చర్చ జరుగుతోంది. మరి ఈ అంశం కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసి డైలామాలో పడేస్తుందా లేక అధికార పార్టీకి కలిసి వచ్చే అంశంగా మారుతుందా అనేది చూడాలి.