రివ్యూ : యు ట‌ర్న్‌

చిత్రం : యు టర్న్

నటీనటులు : స‌మంత‌, ఆది పినిశెట్టి, భూమిక‌, రాహుల్ రవీంద్రన్‌

సంగీతం : పూర్ణచంద్ర తేజ‌స్వీ

దర్శకత్వం : ప‌వ‌న్ కుమార్‌

నిర్మాత : శ్రీనివాసా చిట్టూరి, రాంబాబు బండారు

రేటింగ్ : 4/5

నాగచైతన్యతో పెళ్లి తర్వాత సమంతకు బాగా కలిసొచ్చింది. ఆమె వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటోంది. రంగస్థలం, మహానటి, అభిమన్యుడు సినిమాలతో పెద్ద విజయాలు సాధించాయి. ఇందుకు తాను తీసుకొన్న రిస్కే కారణం. కథల ఎంపికలో రిస్క్ చేశాను కాబట్టే ఆ విజయాలు దక్కాయని చెప్పింది సామ్. ఆమె పెద్ద రిస్క్ చేసి చేసిన చిత్రం ‘యు టర్న్’. రిస్క్ ఎందుకంటే.. ? ఆల్రెడీ కన్నడలో ‘యు టర్న్’ బ్లాక్ బస్టర్ హిట్. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ కథని ఏరికోరి ఎంచుకొంది.

సామ్ అంతలా ఈ సినిమా కోసం తప్పించిందటే.. కచ్చితంగా అది తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కథ అయి ఉంటుంది. ఇక్కడ వరకు బాగానే ఉంది. దీనికి మాతృక దర్శకుడు పవన్ కుమార్ ని ఎంచుకోవడం మెచ్చుకోదగ్గ విషయం. ఆయన అయితే, కథలోని ఫీల్ చెడిపోకుండా సినిమా తీయగలడే భరోసా ఉంటుంది. మరీ.. ఇన్నాళ్లు కమర్షియల్ సినిమాలు చేసిన సామ్ కి ఈ కథ ఎంత వరకు సూటవుతుంది.. ? పైగా ఆమె చేస్తున్న తొలి లేడీ ఓరియెంట్ సినిమా ఇది. ఇన్ని సందేహాలు మధ్య థియేటర్ కు వెళ్లిన ప్రేక్షకుడుని థ్రిల్ చేసింది యు టర్.

కథ :

రచన (స‌మంత) ఓ మీడియా సంస్థలో ఇంటర్న్‌షిప్ చేస్తుంటుంది. అదే సంస్థలో ఉద్యోగం కోసం ఓ హ్యూమన్‌ ఇంట్రస్ట్‌ స్టోరి చేసేందుకు ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంలో ఆర్కేపురం ఫ్లైఓవ‌ర్‌పై రోడ్ బ్లాక్స్ ను త‌ప్పించి యు ట‌ర్న్ తీసుకునే వారిని మీద స్టోరి చేయడానికి రెడీ అవుతుంది. దీనికోసం యుటర్న్‌ తీసుకున్న వ్యక్తుల వెహికిల్‌ నంబర్స్‌ ద్వారా వారి అడ్రస్‌లు, ఫోన్‌ నంబర్లు తెలుసుకుంటుంది.

ఈ ప్రయత్నాల్లో భాగంగా సుందర్‌ అనే వ్యక్తిని కలిసేందుకు ప్రయత్నించినా వీలుపడదు. కానీ, అదే రోజు సుందర్ ఆత్మహత్య చేసుకొని చనిపోవటం జరుగుతుంది. దీంతో రచనను ఇన్వెస్టిగేషన్‌ కోసం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళతారు. విచార‌ణ‌లో భాగంగా రచన డైరీని ప‌రిశీలించిన పోలీసుల‌కు షాకింగ్ నిజాలు తెలుస్తాయి. ఆ డైరీలో ఉన్న వ్యక్తులందరూ సుందర్‌ లాగే గతంలో ఆత్మహత్య చేసుకొని చనిపోతారు.

అసలు ఆ డైరీలో ఉన్న వ్యక్తులు ఎవరు.. ? ఎలా చనిపోయారు.?? వారి మరణానికి రచనకు సంబంధం ఏంటి.? ఈ సమస్యల నుంచి రచన ఎలా బయటపడింది..??? అన్నదే ట్విస్టులతో కూడిన మిగతా క‌థ‌.

ఎలా ఉందంటే ?

ఓ చిన్ని పాయింట్ తో కథని మొదలెట్టి… వరుస ట్విస్టులతో ఆడియన్స్‌ను కట్టిపడేశాడు దర్శకుడు. ఎక్కడ అనవసరమైన కామెడీ, సాంగ్స్‌ లాంటివి ఇరికించకుండా పర్ఫెక్ట్ థ్రిల్లర్‌లా సినిమాను నడిపించాడు. పోలీసులు సమంత రాసుకొన్న డైరీని చూసినప్పటి నుంచి సినిమాపై ఆసక్తి పెరిగింది. అందులో ఉన్నోళ్లంతా ఆత్మహత్య చేసుకొన్నారని పాయింట్ కథని మలుపు తిప్పింది. ఆ తర్వాత వరుస ట్విస్టులతో కథ రక్తికట్టించాడు. క్లైమాక్స్’లో కర్మ భావనను అనుసంధానించడం మరియు వ్యక్తిగత జీవితాలను ఎలా ప్రభావితం చేయడం అనే విషయంతో సినిమాని ఆసక్తిగా ముగించాడు.

ఎవరెలా చేశారంటే ?

సమంత ఇష్టపడి మరీ చేసిన చిత్రమిది. అంతే ఇష్టంగా రచన పాత్రలో ఒదిగిపోయింది. ప్రేమ, భ‌యం, సెంటిమెంట్ ఇలా అన్ని ఎమోష‌న్స్‌ను అద్భుతంగా పండించింది. ఈ సినిమా తర్వాత సామ్ వద్దకు మరిన్ని లేడీ ఓరియెంటెడ్ కథలు రావొచ్చు. ఐతే, సామ్ డబ్బింగ్ విషయంలో ఇంకాస్త శ్రద్ద పెట్టాల్సి ఉంది. ఇక, రచనకు సాయంచేసే పోలీస్ పాత్రలో ఆది పినిశెట్టి సరిగ్గా సరిపోయాడు.
సీనియర్ హీరోయిన్ భూమిక కొద్దిసేపే కనిపించినా ఆకట్టుకొంది. క్లైమాక్స్ లో ఆమె నటన అద్భుతం. స‌మంత ఫ్రెండ్ పాత్రలో క్రైమ్ రిపోర్టర్ గా రాహుల్ ర‌వీంద్రన్‌ నటన బాగుంది. మితిగా నటీనటులు ఫర్వాలేదనిపించారు.

సాంకేతికంగా :

ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అదనపు బలం. అది సినిమా స్థాయిని మరింత పెంచింది. సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్‌ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.

రేటింగ్ : 4/5