మారుతి ప్రస్థానం.. పుట్ పాత్ టు బెంజ్ కార్

‘కష్టే ఫలి’ అంటుంటారు. ఆ కష్టాన్నే నమ్ముకొని స్టార్ దర్శకుడిగా ఎదిగాడు మారుతి. మొదట్లో మారుతి యూత్ ఫుల్ సినిమాలు తీశాడు. వాటిని కొందరు బూతు సినిమాలని కూడా అన్నారు. ఐతే, ఆ తర్వాత బూతు ముద్ర నుంచి బయటపడి ఫ్యామిలీ దర్శకుడు అనిపించుకొన్నాడు. డిఫరెంట్ కాన్సెప్టులతో భలే భలే మగాడివోయ్, మహానుభావుడు సినిమాలతో విజయాలు అందుకొన్నాడు.

మారుతి తాజా చిత్రం ‘శైలజారెడ్ది అల్లుడు’. ఇగో కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం వినాయక చవితి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ టాక్ ని సొంతం చేసుకొంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉన్నట్టు.. వరుస విజయాలు దక్కుతున్న మారుతి పొంగిపోలేదు. శైలజారెడ్డి అల్లుడు ప్రమోషన్స్ లో పాల్గొన్న మారుతి.. ‘అరటిపండ్లు అమ్మిన, ఆఫీస్ బాయ్ గా పనిచేసిన రోజులని గుర్తు చేసుకొన్నారు.

“మా నాన్నది అరటిపండ్ల బండి .. ఆయన చాలా కష్టాలు పడ్డాడు. నేను కూడా అరటిపండ్లు అమ్మిన రోజులున్నాయి. ఆ తరువాత ఆఫీస్ బాయ్ గా పనిచేశాను. జేబులో వున్న రెండు రూపాయలతోనే జిలేబి తిని కడుపు నింపుకున్న సందర్భాలున్నాయి. అదే రోడ్డులో నేను ఇప్పుడు ఖరీదైన కార్లో తిరుగుతున్నాను. నేను ఈ స్థాయికి చేరుకుంటానని నేనే ఊహించలేదు” అని చెప్పుకొచ్చాడు మారుతి.