రేవంత్ రెడ్డికి అరెస్ట్ భయం

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి అరెస్టు భయం పట్టుకొంది. ముందస్తు ఎన్నికల వేళ తెరాస, కేంద్ర ప్రభుత్వంతో కలిసి ప్రత్యర్థులని కోర్టు కేసుల్లో ఇరికించే పని పెట్టుకొందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే జగ్గారెడ్డి అరెస్టు, రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ అయ్యాయని చెప్పుకొంటున్నారు. నోటీసులతో ఆగకుండా రేవంత్ రెడ్డి అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ విషయాన్ని స్వయంగా రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టీ మరీ చెప్పారు.

సోమవారం గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. “ఈడీ, ఐటీ శాఖలు తనపైనా, తన కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లపైనా దాడులకు సిద్ధమయ్యాయని.. ప్రణాళిక ప్రకారం కేంద్ర విచారణ సంస్థలు నిఘా కొనసాగిస్తున్నాయి.. రెండు మూడు రోజుల్లో తనను అరెస్టు చేసేందుకు కచ్చితమైన ఆదేశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు”.

భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా హైదరాబాద్‌ వచ్చినప్పుడు తెరాసలో కీలక నేతలు కొందరు ఆయనను కలిశారని.. ఇంకా రేవంత్‌రెడ్డిని అరెస్టు చేయలేదేమని అడిగినట్లు విశ్వసనీయ సమాచారం ఉందన్నారు. ఎన్నికల వేళ పార్టీశ్రేణులు అప్రమత్తంగా ఉండాలని.. క్రియాశీలకంగా వ్యవహరించే రాజకీయ నాయకులు, పౌరులపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని రేవంత్ సూచించారు.