మోహన్ బాబుకు మాతృ వియోగం

ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకు మాతృవియోగం కలిగింది. మోహన్ బాబు తల్లి మంచు లక్ష్మమ్మ(85) కన్నుమూశారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మమ్మ ఈరోజు ఉదయం కన్నుమూశారు. మంచు లక్ష్మమ్మ పార్థివదేహాన్ని తిరుపతి నుంచి ఎ.రంగంపేట సమీపంలోగల మోహన్ బాబు విద్యాసంస్థలు విద్యానికేతన్ ప్రాంగణంలోని ఆమె నివాసానికి తరలించారు.

తల్లి మరణించిన సమయంలో మోహన్ బాబు అక్కడ లేరు. ఈ విషయం తెలిసిన వెంటనే మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి హూటాహుటిన తిరుపతికి బయల్దేరారు. తన నానమ్మ మరణవార్త విని మంచు మనోజ్‌ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన ప్రస్తుతం సింగపూర్ లో ఉన్నట్టు తెలిసింది.

‘ మా నానమ్మ లక్ష్మమ్మ దేవుడి దగ్గరికి వెళ్లిపోయారు. మిమ్మల్ని మిస్సవుతాం నానమ్మ. ఈ సమయంలో నేను భారతదేశంలో లేకపోవడం బాధకలిగిస్తోంది. ఇది అనుకోకుండా జరిగిపోయింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.’ నని మనోజ్ ట్విట్ చేశారు. ఈ సాయంత్రానికి కల్లా మనోజ్ ఇక్కడికి చేరుకోనున్నారు. శుక్రవారం లక్ష్మమ్మ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

లక్ష్మమ్మకు నలుగురు పిల్లలు. మోహన్ బాబు కాకుండా మరో ముగ్గురు మగ సంతానం. రంగనాథ చౌదరి, రామనాధ చౌదరి, కృష్ణలతో పాటు ఆడ కూతురు విజయ ఉన్నారు. ఇందులో కృష్ణ చాలా కాలం పాటు లక్ష్మి ప్రసన్న నిర్మాణ వ్యవహారాల్లో చురుకుగా ఉండేవారు. గత ఏడాది జనవరిలో మోహన్ బాబు తండ్రి నారాయణ స్వామి కాలం చేశారు. లక్ష్మమ్మ భర్త పోయాక తిరుపతిలోనే ఉంటున్నారు.