రివ్యూ : నన్ను దోచుకుందువటే
చిత్రం : నన్ను దోచుకుందువటే (2018)
నటీనటులు : సుధీర్‌బాబు, నభా నటేష్
సంగీతం : అజనీష్ లోక్‌నాథ్
దర్శకత్వం : ఆర్.ఎస్. నాయుడు
నిర్మాత : సుధీర్‌బాబు
విడుదల తేది : 21సెప్టెంబర్, 2018.
రేటింగ్ : 2.75/5
సుధీర్ బాబు మంచి నటుడు. ఐతే, ఆయన ఖాతాలో ‘ప్రేమకథా చిత్రమ్’ తర్వాత చెప్పుకోదగ్గ విజయాలు మాత్రం లేవ్. ఇదంతా ‘శమంతకమణి’ సినిమా ముందు వరకు సంగతి. ‘శమంతకమణి’ సినిమా తర్వాత కొత్త సుధీర్ బాబు కనిపిస్తున్నాడు. విభిన్నమైన కథలని ఎంచుకొంటున్నాడు. ఇటీవలే ‘సమ్మోహనం’తో సూపర్ హిట్’తో జోరుమీదున్న ఆయన నిర్మాణంలోకి అడుగుపెట్టారు. తన తొలి ప్రయత్నంగా ‘నన్ను దోచుకుందువటే’ నిర్మించారు. ఆర్.ఎస్. నాయుడిని దర్శకుడిగా పరిచయం చేశారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ ని చూస్తే సుధీర్ బాబు మరో హిట్ కొట్టబోతున్నట్టు అనిపించింది. ఇంతకీ ‘నన్ను దోచుకుందువటే’ ఎలా ఉంది ? ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొంది తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
కార్తీక్ (సుధీర్‌బాబు) ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో మేనేజర్. పని తప్ప మరో ప్రపంచం తెలియదు. ఆఫీసులో ఆయనంటే అందరికీ హడల్. అమెరికాకి వెళ్లి నాన్న (నాజర్) కళ్లల్లో సంతోషం చూడాలన్నదే ఆయన ఆశయం. ఇంతలో మేనమామ కూతురు సత్య (వర్షిణి)తో కార్తీక్ పెళ్లి చేయాలనుకుంటారు నాజర్. అనుకోని పరిస్థితుల్లో కార్తీక్ జీవితంలోకి షార్ట్‌ఫిలింస్‌లో నటించే మేఘన (నభా నటేష్) ప్రవేశిస్తుంది. తండ్రి (నాజర్) కోసం కార్తీక్, మేఘన లవర్స్‌గా నాటకం ఆడుతారు. కానీ, అనుకోకుండా ఒకరంటే మరొరకరి ఇష్ట ఏర్పడి ప్రేమలో పడుతారు. అసలు కార్తీక్ ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అమెరికా వెళ్లాలన్న కార్తీక్ కోరిక తీరిందా? అన్నది మిగితా
కథ.
ప్రేక్షకుడి మనసుదోచే అంశాలు :
తెలుగు ప్రేక్షకులకు తెలిసిన కథే. ఆ కథని ఆసక్తిగా చెప్పే ప్రయత్నం చేశాడు కొత్త దర్శకుడు ఆర్.ఎస్. నాయుడు. హీరో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో మేనేజర్. చాలా స్ట్రిక్ట్. ఆయనంటే అందరికీ హడల్. ఆ సన్నివేశాలని వినోదాత్మకంగా చూపించి మార్కులు కొట్టేశాడు. ఇక, సుధీర్ బాబు షార్ట్ ఫిల్మ్ లో నటించే సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలిచాయి. మొత్తంగా.. ఫస్టాఫ్ సరదా సరదాగా సాగింది. సెకాంఢాఫ్ కూడా ఇదే రేంజ్ లో ఉంటే సినిమా సూపర్ హిట్. సినిమా చూస్తున్న ప్రేక్షకుడి ఫీలింగ్ ఇది.
ఐతే, సెకాంఢాఫ్ ప్రారంభం నుంచి గాడి తప్పినట్టు అనిపించింది. దీంతో ఫస్టాఫ్ లో సినిమాపై ప్రేక్షకుడికి కలిగిన అభిప్రాయం క్రమ క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇంతలో ఎమోషనల్ సీన్స్ అద్భుతంగా పండించాడు. క్లైమాక్స్ లో తండ్రి-కొడుకుల మధ్య ఎమోషనల్స్ సీన్ మళ్లీ సినిమాని లేపింది. ఫస్టాఫ్ లో కామెడీ సీన్స్, సెకాంఢాఫ్ లో ఎమోషనల్ సీన్స్ హైలైట్ గా నిలిచాయ్.
ఎవరెలా చేశారు :
తొలి సగభాగం సినిమా సరదాగా సాగిపోతుంది. ద్వితీయార్థంలో కథ మరింత ఆసక్తికరంగా సాగే అవకాశం ఉన్నా, మంచి డ్రామాకి చోటున్నా, దర్శకుడు అటువైపు దృష్టిపెట్టలేదు. దాంతో చాలా సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ప్రథమార్థంలో సుధీర్‌బాబు షార్ట్‌ఫిల్మ్‌లో నటించే సన్నివేశాలు చిత్రానికి హైలెట్‌గా నిలిచాయి. తన క్రమశిక్షణతో భయపెట్టే బాస్‌గానూ, బయట కూడా సీరియస్‌గా కనిపించే ఓ యువకుడిగా సుధీర్‌బాబు నటన బాగుంది. నభా నటేష్ పక్కింటి అమ్మాయిలా కనిపిస్తూనే, నటనతో ఆకట్టుకొంది. నాజర్ తండ్రి పాత్రలో కనిపిస్తారు. వైవా హర్ష, వేణు, సుదర్శన్, గిరి తదితరులు పరిధి మేరకు హాస్యం పండించారు.
సాంకేతికంగా :
తొలి చిత్రమే అయినా దర్శకుడి పనితీరులో ఎంతో స్పష్టత కనిపించింది. ముఖ్యంగా హాస్యం, సెంటిమెంట్ విషయంలో ఆయన పట్టుందని నిరూపించారు. అజనీష్ పాటలు గుర్తు పెట్టుకొనేలా మాత్రం లేవు. సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాతగా కూడా సుధీర్‌బాబు తొలి ప్రయత్నంలోనే తనకున్న అభిరుచిని చాటిచెప్పారు. సినిమా స్థాయికి తగ్గట్టుగా నిర్మాణ విలువలు కనిపిస్తాయి.
చివరగా : సగం మనసు దోచుకుందువటే
రేటింగ్ : 2.75/5