‘నోటా’ విడుదల ప్రేక్షకుల చేతుల్లో !
‘గీత గోవిందం’తో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొన్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా హిట్ కిక్కులో ఉండగానే ఆయన నటించిన మరో చిత్రం ‘నోటా’ రిలీజ్ కు రెడీ అయ్యింది. అక్టోబర్ 4న రిలీజ్ డేటు అనుకొన్నారు. ఐతే, ఈ సినిమా వివాదాల్లో ఇరుక్కొంది.
డియో గ్రీన్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని జ్ఞానవేల్ రాజ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీ తెలుగు రచన హక్కుల విషయంలో వివాదం చోటు చేసుకుంది. ఒప్పందాన్ని అతిక్రమించి తనను చిత్రం నుంచి తొలిగించారని రచయిత శశాంక్ వెన్నలకంటి పోలీసులను ఆశ్రయించాడు. ఇదీగాక, తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టైటిల్ పై సోషల్ మీడియా వేదికగా పెద్ద రాద్దాంతం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ‘నోటా’ విడుదలపై విజయ్ స్పందించారు. “ఇది చాలా అర్జంట్. ఇంపార్టెంట్. సినిమా రిలీజ్ చేయడానికి కొన్ని మంచి రోజులున్నాయి. అదే విధంగా చెడ్డ రోజులు కూడా ఉన్నాయి. కానీ, నోటా రిలీజ్ డేట్ విషయంలో చాలా డ్రామాలు జరుగుతున్నాయి. నా సినిమాను మీరు ఎప్పుడు రిలీజ్ చేయమంటే అప్పుడే చేస్తాను” అంటూ ఓ పోల్ పెట్టి 4 ఆప్షన్లు ఇచ్చారు. అక్టోబర్ 5, అక్టోబర్ 10, అక్టోబర్ 18 మూడు ఆప్షన్లు కాగా నాలుగో అప్షన్ ‘నోటా'(ఏదీ వద్దు) అని ఇచ్చారు.
ఈ పోల్ ఫలితం ఆధారంగానే…. రేపు సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తామని విజయ్ దేవరకొండ తెలిపారు. వివాదాలని పబ్లిసిటీగా మలుచుకోవడం విజయ్ కి మాత్రమే చెల్లింది. ‘గీత గోవిందం’ కోసం అదే చేశాడు. ఇప్పుడు ‘నోటా’ విషయంలోనూ అదే ఫాలో అయ్యాడు విజయ్. మరీ.. ‘నోటా’ రిలీజ్ విషయంలో ప్రేక్షకుల ఓటు ఏవిధంగా ఉంటుందన్నది ఈ రోజు తెలిసిపోనుంది.