రెండు చోట్ల విజయ్ పబ్లిక్ మీటింగ్ !

తెలుగు రాష్ట్రాల్లో హీరో విజయ్ దేవరకొండ రాజకీయాలు మొదలెట్టబోతున్నాడు. ఇందుకోసం రెండు చోట్ల పబ్లిక్ మీట్’ని ప్లాన్ చేసుకొన్నాడు. ఇందులో ఒకటి విజయవాడలో, రెండోది హైదరాబాద్ లో నిర్వహించబోతున్నాడు. ఐతే, ఇదంతా ఆయన తాజా చిత్రం ‘నోటా’ ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించబోతున్న పబ్లిక్ మీట్స్.

విజయ్ నటించిన ద్విబాషా చిత్రం ‘నోటా’. ఆనంద్ శంకర్ దర్శకుడు. జ్ఞానవేల్ రాజా నిర్మాత. ఈ పొలిటికల్ థ్రిల్లర్ అక్టోబర్ 5న తెలుగు, తమిళ్ లోనూ విడుదల కానుంది. ఐతే, తెలుగు ‘నోటా’ ప్రమోషన్స్ కార్యక్రమాలని విజయ్ తన భుజాలపై వేసుకొన్నాడు. ఇందులో భాగంగా ‘ది నోటా పబ్లిక్ మీట్’ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో రెండు ఈవెంట్స్ నిర్వహించబోతున్నాడు.

ఈ నెల 30న విజయవాడ – బెంజ్ సర్కిల్లోని ‘ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్’లో, అక్టోబర్ 1న హైదరాబాద్ యూసఫ్ గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో ‘ది నోటా పబ్లిక్ మీట్’లో విజయ్ పాల్గొననున్నారు. టాలీవుడ్ లో విజయ్ ఇప్పటికే స్టార్ హీరో అనిపించుకొన్నాడు. కోలీవుడ్ లో మాత్రం ఆయన చేసిన తొలి చిత్రమిది. అక్కడి ప్రేక్షకులని యూత్ మెగాస్టార్ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.