టీ-కాంగ్రెస్ బంపర్ ఆఫర్
ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ బంపర్ ఆఫర్లని ప్రకటిస్తోంది. ఇప్పటికే రెండు లక్షల వరకు రుణమాఫీ, ఫించన్ల పెంపు.. అంటూ ఆఫర్లు కురిపించింది. వాటిని అమలు చేయాలంటే దక్షణాది ఐదు రాష్ట్రాల బడ్జెట్ కూడా సరిపోదని మంత్రి కేటీఆర్ విమర్శిస్తున్నారు. ఐతే, అవేవి పట్టించుకోకుండా టీ-కాంగ్రెస్ ఆఫర్లని ప్రకటిస్తూనే ఉంది.
తాజాగా, మరో బంపర్ ఆఫర్ ప్రకటించేసింది. తాము అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని.. అది కూడా వందరోజుల్లోనే అంటూ తెలిపింది. ఈ ఆఫర్ నిరుద్యోగులని టెంప్ట్ చేస్తోంది. ఎందుకంటే.. గత నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులు, విద్యార్థులు కాస్త నిరాశలో ఉన్నట్టు కనిపించింది.
అలాగని టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయడం లేదని కాదు. అది కాస్త ఆలస్యమైంది. ముందుగా చెప్పినట్టు లక్ష ఉద్యోగాల భర్తీ, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్న హామీని టీఆర్ ఎస్ నిలబెట్టుకోలేకపోయింది. ఇక, ఉద్యోగల భర్తీ నోటీఫికేషన్స్ విషయంలో ఆలస్యం అయ్యింది. ఇప్పుడు ఎన్నికల ముందు నోటీఫికేషన్స్ క్యూ కడుతున్నాయి. ఐతే, అప్పటికే టీఆర్ ఎస్ పై నిరుద్యోగుల్లో అసంతృప్తి పెరిగిపోయింది.
ఇప్పుడా అసంతృప్తిని తెలంగాణ కాంగ్రెస్ పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొనే పనిలో భాగంగానే.. వంద రోజుల్లో రెండు లక్షల ఉద్యోగ భర్తీ ఆఫర్ ని ప్రకటించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. అది సాధ్యమా.. ? అసాధ్యమా.. ?? అనే మాట పక్కన పెడితే ఎన్నికల వేళ.. ఓట్లు కురిపించే ఎత్తుగడగా హస్తం నేతలు భావిస్తున్నారు.