ఇదీ.. త్రివిక్రమ్ ట్రైలర్ !
‘త్రివిక్రమ్ సినిమా’ అంటే మాటలు కోటలు దాటుతాయ్. క్యూట్ మాటలు, టన్నీల కొద్దీ పంచులు, కన్నీళ్లు పెట్టించే ఎమోషన్స్, ఇంటికి వరకు తీసికెళ్లే విషయాలు.. జీవితంలో పాటించాల్సిన అంశాలు ఉంటాయి. ఆయన తాజా చిత్రం ‘అరవింద సమేత’లోనూ అవన్నీ ఉన్నాయి. మనిషిగా ఎలా బతకాలో చెప్పే చిత్రమిది.
మంగళవారం హైదరాబాద్ లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ వేడుక జరిగింది. టీజర్ లో యాక్షన్ హైలైట్ గా చూపించారు. దాంతో పాటు రాయలసీమ యాసలో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ వినిపించాయ్. ఐతే, అది ఎన్ టీఆర్ టీజర్ గా పేరు తెచ్చుకొంది. బహుశా.. ఎన్ టీఆర్ రంగంలోకి దగడం వలన త్రివిక్రమ్ కనిపించలేమో.. !
ఇప్పుడా లోటు ట్రైలర్ తో తీరింది. హీరో-హీరోయిన్ మధ్య క్యూట్ మాటలు, జీవిత అనుభవం మాటు నుంచి త్రివిక్రమ్ రాసుకొన్న మాటలు ట్రైలర్ లో హైలైట్ గా నిలిచాయి. ‘30 ఏండ్లనాడు మీ తాత కత్తి పట్టినాడంటే అది అవసరం.. అదే కత్తి మీ నాయన ఎత్తినాడంటే అది వారసత్వం.. అదే కత్తి నువ్వు దూసినావంటే అది లక్షణం. ఆ కత్తి నీ బిడ్డనాటికి లోపం అయితందా’ అని ఎన్టీఆర్‌తో ఆయన బామ్మ చెప్పే డైలాగ్ హైలైట్‌గా నిలిచింది.
‘సర్ వంద అడుగుల్లో నీరు పడుతుంది అంటే 99 అడుగుల వరకు తవ్వి ఆపేసే వాడిని ఏమంటారు? మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఈ ఒక్క అడుగు వంద అడుగులతో సమానం సర్. తవ్వి చూడండి’ అంటూ ఎన్టీఆర్ చివర్లో భావోద్వేగంతో అనే మాటలు ఆకట్టుకున్నాయి. అంతకంటే ముందు ‘మదిరప్పా.. ఇక్కడ మంది లేరా? కత్తులు లేవా?’ అంటూ ఎన్టీఆర్ రాయలసీమ పౌరుషం చూపించారు.