రివ్యూ : నోటా
చిత్రం : నోటా (2018)
నటీనటులు : విజయ్ దేవరకొండ, మెహ్రీన్
సంగీతం : సామ్ సీయస్
దర్శకత్వం : ఆనంద్ శంకర్
నిర్మాత : జ్ఞానవేల్ రాజా
రిలీజ్ డేటు : 05 అక్టోబర్, 2018.
రేటింగ్ : 3/5
పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్స్ తో టాలీవుడ్ స్టార్ హీరోల లిస్టులో చేరిపోయాడు విజయ్ దేవరకొండ. ఈ మూడు చిత్రాలు దేనికదే విభిన్నమైనవి. ఆయన నటించిన ద్విబాషా చిత్రం ‘నోటా’. ఆనంద్ శంకర్ దర్శకుడు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ తో విజయ్ కోలీవుడ్ లో తన అదృష్ఠాన్ని పరీక్షించుకోనున్నాడు. భారీ అంచనాల మధ్య ‘నోటా’ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. నోటా ఎలా ఉంది ? ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకొంది ?? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
ముఖ్యమంత్రి వాసుదేవ్ (నాజర్) కొడుకు వరుణ్ (విజయ్ దేవరకొండ). వరుణ్’కు రాజకీయాలంటే గిట్టవు. లండన్ లో వీడియో గేమ్ డిజైనర్ గా పనిచేస్తుంటాడు. తండ్రి కోరిక మేరకు వరుణ్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాల్సి వస్తుంది. అసలు రాజకీయాలంటేనే పడని వరుణ్.. పొలిటికల్ వార్ ని ఎలా తట్టుకొన్నాడు ? ఇంతకీ ఆయన రాజకీయాల్లో కొనసాగగలిగాడా.. ? అన్న విషయాన్ని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను టచ్ చేస్తూ సాగిన మిగితా కథ ‘నోటా’.
ఎలా ఉందంటే ?
ఇలాంటి కథలు టాలీవుడ్ కి కొత్తేమీ కాదు. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు లీడర్, భరత్ అను నేను చూసేశారు. ఇది అలాంటి కథే. ఆరంభంలో మరీనూ. అసలు ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని కొడుకుని వచ్చి తండ్రి స్థానంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టడం చూశాం. ఐతే, ఆ తర్వాతి కథ మాత్రం ఢిఫరెంటు. అప్పటి వరకు సరదా గడిపిన యువకుడు సడెన్ ముఖ్యమంత్రి అయి.. రాజకీయాలని సీరియస్ గా తీసుకోవడం మొదలెట్టినప్పటి నుంచి కథ సీరియస్ మూడ్ లోకి వెళ్తుంది. అక్కడ నుంచి కథని చాలా గ్రిప్పింగ్ గా నడిపాడు దర్శకుడు. హీరో పాలిటిక్స్ ని సీరియస్ గా తీసుకొనే క్రమంలో రాసుకొన్న ఓ ట్విస్టు బాగుంది.
ఆ తర్వాత వచ్చే పొలిటికల్ సటైర్స్, ఉగ్రవాదుల ఏపీసోడ్, నాజర్ పై ఎటాక్ తో ఫస్టాఫ్ ఆసక్తిగా సాగింది. అది సెకాంఢాఫ్ పై అంచనాలని పెంచేసింది. సెకాంఢాఫ్ లో అధికార-ప్రతిపక్షాల మధ్య పొలిటికల్ వార్ ఏపీసోడ్ బాగుంది. హీరో ప్రతిపక్షాలని టార్గెట్ చేయడం ఆకట్టుకొనేలా ఉంది. ఐతే, అక్కడక్కడ సినిమా పడుతూ.. లేస్తూ సాగినట్టు అనిపించింది. ఇక, క్లైమాక్స్ లో పొలిటికల్ మైండ్ గేమ్ సన్నివేశాలు హైలైట్ గా నిలిచాయి.
ఎవరెలా చేశారంటే ?
విజయ్ దేవరకొండ ప్రతి సినిమాకు ప్రేక్షకులకి షాక్ ఇస్తూ వస్తున్నాడు. పెళ్లి చూపులు చేసిన హీరో ‘అర్జున్ రెడ్డి’ చేశాడంటే నమ్మబుద్ది కాలేదు. ‘అర్జున్ రెడ్డి’ హీరో ‘గీత గోవిందం’ చేశాడంటే నోరెళ్లబెట్టాం. ఇప్పుడు ‘నోటా’ విషయంలోనూ అదే జరిగింది. యంగ్ ముఖ్యమంత్రి పాత్రలో విజయ్ అదరగొట్టేశాడు.
అంతకంటే ముందే సినిమా ప్రారంభంలో పాత విజయ్ కనిపించాడు. అది ఆయన అభిమానులని ఖుషి చేసింది. ఆ తర్వాత ఫక్తు పొలిటిషన్ గా సినిమాని తన భుజాలపై వేసుకొని నడిపించారు. సినిమాలో హీరోయిన్ మెహ్రీన్ కు నటించే స్కోప్ లేదు. ఐతే, కనిపించినంత సేపు ఆకట్టుకొంది. నాజర్, సత్యదేవ్ ల నటన బాగుంది. ప్రియదర్శన్ హీరో స్నేహితుడి పాత్రలో కనిపించారు. మిగితా నటీనటుల తమ తమ పరిధి మేరకు నటించారు.
సాంకేతికంగా :
‘నోటా’ టెక్నికల్ గానూ బాగుంది. సామ్ సీయస్ నేపథ్య సంగీతం అదిరిపోయింది. సినిమాకే హైలైట్ గా నిలిచింది. పాటలు ఫర్వాలేదు. సినిమాటోగ్రఫి బాగుంది. సెకాంఢాప్ లో కొన్ని చోట్ల సినిమా స్లోగా నడిచినట్టు అనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
చివరగా : ‘నోటా’లో పొలిటికల్ హీటు బాగుంది.
రేటింగ్ : 3/5